
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది.. ఈ ఘటన గురించి విన్నోళ్లు ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. రాను రాను మనుషుల్లో పెరిగిపోతున్న సైకోతనానికి ఈ ఘటన నిదర్శనమని చెప్పచ్చు. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఓ యువకుడు 70 ఏళ్ళ వృద్ధురాలిని చంపి.. శవంపై డ్యాన్స్ చేశాడు. అంతే కాకుండా సెల్ఫీ వీడియోలను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాడు సదరు సైకో. మంగళవారం ( ఏప్రిల్ 15 ) వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి..
కుషియాగూడకు చెందిన 70 ఏళ్ళ కమలాదేవి ఒంటరిగా ఉంటోంది. కమలాదేవికి చెందిన షాపులో రెంటుకు ఉంటున్నాడు ఓ యువకుడు. అద్దె విషయంలో యువకున్ని మందలించిందన్న కారణంతో వృద్ధురాలిపై కక్ష పెంచుకున్నాడు యువకుడు. ఈ క్రమంలో ఏప్రిల్ 11వ తేదీన వృద్ధురాలని చంపి తాళం వేసి పారిపోయాడు యువకుడు.
ఇంట్లోంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. మృతదేహాన్ని రికవరీ చేసుకొని పోస్టుమార్టం కోసం పంపారు పోలీసులు. యువకుడు పంపిన సెల్ఫీ వీడియో బెంగళూరులో వైరల్ కావడంతో సమాచారం పోలీసులకు చేరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.