
- ఐదుగురికి తీవ్ర గాయాలు
న్యూఢిల్లీ: పంజాబ్ లోని అమృత్ సర్ స్వర్ణ దేవాలయం ఆవరణలో ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఆలయ ఆవరణలో ఉన్న భక్తులపై ఐరన్ రాడ్డుతో దాడిచేసి ఐదుగురిని తీవ్రంగా గాయపరిచాడు. గురు రామ్ దాస్ లంగర్ లో భక్తులు ఉండగా దాడికి పాల్పడ్డాడు. గాయపడిన వారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి (ఎస్ జీపీసీ) చెందిన ఇద్దరు వలంటీర్లు ఉన్నారు. ఆ వలంటీర్లలో ఒకరిని శ్రీగురు రామ్ దాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు. దాడి జరిగిన వెంటనే అక్కడున్న వారు ఉన్మాదితో పాటు దాడికి సహకరించిన మరో వ్యక్తిని పట్టుకున్నారు.
అనంతరం పోలీసులు వచ్చి ఆ ఇద్దరిని అరెస్టు చేశారు. దాడికి ముందు ఇద్దరూ ఆ ప్రాంతంలో రెక్కీ చేశారని పోలీసులు తెలిపారు. అటాక్ కు పాల్పడిన వ్యక్తిని హర్యానాకు చెందిన జుల్ఫాన్ గా గుర్తించారు. కాగా.. ఈ సంఘటనతో ఆలయ ఆవరణలో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఎస్ జీపీసీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.