
ఆడపిల్లలపై ఈ సమాజంలో ఇంకా చిన్నచూపు తగ్గడం లేదు. ఆడపిల్ల పుట్టిందని చెత్తకుప్పల్లో పడేసేవాళ్లు కొందరు ఉంటే.. మరి కొందరు ఆడపిల్ల పుట్టడం మొత్తం మహిళ చేతుల్లోనే ఉంది అన్నట్లుగా ఇల్లాలును నానా మాటలతో, చిత్ర హింసలు పెట్టడం చూస్తూనే ఉన్నాం. అలాంటి ఘగటనే ఉత్తరాఖండ్ లో జరిగింది. ఆడపిల్లను కన్నందుకు భార్యను స్క్రూడ్రైవర్ తో దాడి చేసి చిత్ర హింసలు పెట్టాడు ఓ భర్త.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ కాశీపూర్ కు చెందిన ఒక భర్త తన భార్య హర్జింద్ కౌర్ పై స్క్రూడ్రైవర్ తో విచక్షణా రహితంగా దాడిచేశాడు. దీంతో తలకు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపిస్తున్నట్లుగా.. భార్య జుట్టు పట్టి విచక్షణా రహితంగా దాడి చేస్తున్నాడు. నేలపై పడి ఉన్న భార్య స్క్రూడ్రైవర్ గాయాలకు అరుస్తూ.. వదిలయ్యమని ఎంత ప్రాధేయపడినా వదలకుండా దాడికి దిగాడు. భార్య బట్టలపై రక్తపు మరకలతో ధీనంగా ఏడుస్తోంది. అడ్డుకోవడానికి వచ్చిన వారిని బెదిరించాడు. దగ్గరికి వస్తే మరింతగా దాడి చేస్తానని హెచ్చరించడంతో అందరూ దూరంగా ఉండిపోయారు.
తర్వాత ఆ మహిళను ఆస్పత్రిలో చేర్పించారు. తల, మెడ, కుడి చెవిపై తీవ్రంగా గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. తమకు కొడుకు కావాలని, అదేవిధంగా 5 లక్షల రూపాయల డబ్బు, బంగారం అదనపు కట్నంగా ఇవ్వాలని భర్తతో పాటు అత్తామామలు కొన్నాళ్లుగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘ఇంటికి వచ్చి నీ బట్టలు, వస్తువులు అన్నీ తీసుకెళ్లు. అలాగైలే మేము నిన్ను వదిలేస్తాం’’ అని బెదిరించడంతో తన సోదరుడిని తీసుకుని వెళ్లింది. ఇంటికి వెళ్లగానే భర్తతో పాటు అత్తామామలు కూడా దాడి చేశారు. వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.
మరో విషయం ఏంటంటే.. తన భర్త, అత్తమామలు కలిసి తనను, పుట్టిన పాపను చంపాలని ప్రయత్నించారని బాధితురాలు చెప్పింది. విడాకులు ఇస్తే భరణం ఇవ్వాల్సి వస్తుందని, అందుకే ముందుగానే చంపేయాలని ప్లాన్ చేశారని చెప్పింది. వివరాలు సేకరించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఒకవైపు ఆడపిల్ల పుడితే మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని కళ్లకద్దుకునే వాళ్లు ఉన్నారు. ఆడపిల్లలు దొరకట్లేదని ఎదురుకట్నం ఇచ్చి చేసుకునేవాళ్లూ ఉన్నారు. కానీ ఇలాంటి మూర్ఖులు ఆడపిల్ల పుట్టిందని దారుణానికి ఒడిగడుతున్నారు. అయినా పుట్టేది ఆడపిల్లా, మగపిల్లవాడా అనేది భార్య నిర్ణయించేది కాదు అనే సంగతి తెలుసుకోలేకపోతున్నారు. అది క్రోమోజోముల కలయిక వలన జరుగుతుందని ఎప్పుడు తెలుసుకుంటారో. ఈ దాడి చేసిన వ్యక్తి బాగా చదువుకున్నట్లు కనిపిస్తున్నాడు. ఏం లాభం.. కనీస అవగాహన లేకపోతే అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
‘‘మీ తల్లి ఒకప్పుడు ఆడపిల్లగానే పుట్టింది.. ఆమె వల్లనే నువ్వు ఈ రోజు మగ పుట్టుక పుట్టావు. నీ భార్య కావాల్సి వస్తే కూడా ఆడపిల్లగా పుట్టిన వ్యక్తి నీకు భార్యగా వచ్చింది. కానీ నీకు ఆడపిల్ల పుడితే మాత్రం వద్దంటావా.. ఇంత దారుణంగా దాడి చేస్తావా?’’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.