తల్లి మరణించడంతో కొడుకు చేసిన దశదిన కర్మ దాదాపు 1500 మంది ప్రాణాలమీదికొచ్చింది. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాకు చెందిన సురేష్ భార్యతో కలిసి దుబాయ్ లో వెయిటర్ గా పనిచేస్తూ నివసిస్తున్నాడు. అయితే అతని తల్లి మరణించడంతో అతను ఆమె అంత్యక్రియలకు రాలేకపోయాడు. దాంతో అతను భార్యతో కలిసి మార్చి 17న దుబాయ్ నుంచి మొరెనాకు వచ్చాడు. తల్లి గౌరవార్థం మార్చి 20న దశదిన కర్మ ఘనంగా నిర్వహించాడు. ఆ విందుకు దాదాపు 1500 మందిని ఆహ్వానించాడు.
ఆ తర్వాత వారం రోజులకు సురేష్ అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా అతనికి కరోనా సోకినట్లు తేలింది. అయితే అతడు, అతని భార్య మొరెనాకు వచ్చినప్పడు వారిలో అటువంటి లక్షణాలు ఏవీ లేవు. కానీ, వారం తర్వాత పాజిటివ్ అని తేలడంతో.. ఆ విందుకు హాజరయిన వారందరూ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. సురేష్ దంపతులు మొరెనాకు రావడానికి రెండు రోజుల ముందు అతని భార్య అనారోగ్యానికి గురయిందని సురేష్ తెలిపాడు. దాంతో అధికారులు వెంటనే ఫంక్షన్ జరిగిన ప్రాంతాన్ని మొత్తం క్లోజ్ చేశారు.
స్పందించిన అధికారులు.. సురేష్ దగ్గరి బంధువులలో 23 మందిని పరీక్షించగా.. వారిలో పదిమందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 13 మంది ఆస్పత్రిలో ఐసోలేషన్ చేయబడ్డారు. ఫంక్షన్ కు హాజరయిన వారందరిని 14 రోజుల పాటు హోం క్వాంరంటైన్ లో ఉండాల్సిందిగా చెప్పినట్లు
మొరెనా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్‌సి బండిల్ తెలిపారు.
కరోనా వల్ల భారత్ లో ఇప్పటివరకు 3127 మంది అనారోగ్యం పాలయ్యారు. కాగా.. అందలో 229 మంది కోలుకోగా.. 2,812 మంది ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ వల్ల దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86 మంది మరణించారు. ఇక మధ్యప్రదేశ్ విషయానికొస్తే.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 154కు చేరుకుంది. అందులో 8 మంది చనిపోగా.. 146 కేసులు ఆక్టివ్ గా ఉన్నాయి.
For More News..