
మెదక్ టౌన్, వెలుగు : వినాయకులను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన మెదక్ పట్టణంలో జరిగింది. మెదక్ టౌన్ సీఐ వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం... జిల్లాలోని హవేళీ ఘనపూర్ మండలం పోచమ్మరాల్ తండాకు చెందిన మూడ్ సంతోష్ (25) శుక్రవారం రాత్రి మెదక్ పట్టణంలో వినాయకులను చూసేందుకు వెళ్తున్నానని భార్య సరస్వతి, కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం శనివారం ఉదయం మెదక్‌లోని ఫతేనగర్ ఏపీజీవీబీ బ్యాంకు వద్ద అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు.
ఈ విషయాన్ని పోలీసులు మృతుడు సంతోష్ భార్య సరస్వతికి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొన్న సరస్వతి.. తన భర్త మృతిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెదక్ టౌన్ పోలీసులు ఆమె ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.