కింగ్ కోబ్రాతో పోరాటం మాములుగా లేదు

కింగ్ కోబ్రాతో పోరాటం మాములుగా లేదు

పాము..ఈ పేరు వింటేనే భయంతో హడలిపోతాం. అలాంటిది కంటికి కనిపిస్తే కానరానంత దూరంగా పారిపోతాం. అందులో బుసలు కొడుతూ కింగ్ కోబ్రా  కంటపడితే ఇంకేముంది పై ప్రాణాలు పైనే పోతాయి. దాన్ని చూస్తేనే చాలు ఎవ్వరైనా హడలిపోవాల్సిందే. అత్యంత విషపూరితమైన కింగ్ కోబ్రాను  పట్టుకోవడం అంటే ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే. అది సామాన్యుల వల్ల అస్సలు సాధ్యం కాదు. విషపూరితమైన పామును పట్టుకునేందుకు ఎంతో ధైర్యం ఉండాలి. జీవితంపై ఆశలు వదులుకున్నవారే అలాంటి పనులు చేస్తారు. కానీ థాయ్ లాండ్ లో మాత్రం నౌహడ్ అనే వ్యక్తి ఎంతో చాకచక్యంగా కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబీలో కింగ్ కోబ్రా ఓ తోటలోకి ప్రవేశించి సెప్టిక్ ట్యాంకులో దాక్కోవడానికి ప్రయత్నించింది. అదే సమయంలో స్థానికులు దాన్ని చూసి భయంతో వణికిపోయారు. ఎలాగైనా దాన్ని చంపాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎవ్వరూ  దాని ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయారు.  వెంటనే అధికారులకు సమాచారం అందించారు. ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న నౌహడ్ ను సంప్రదించారు. ఇతను పాములు పట్టుకోవడంలో ఎక్స్ పర్ట్.. అతను వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకునేందుకు ప్రయత్నించాడు. 

బుసలు కొడుతూ రహదారిపైకి వచ్చిన కింగ్ కోబ్రా

మొదటగా కింగ్ కోబ్రాను తోటలో నుంచి రహదారిపైకి రప్పించాడు. కోపంతో కింగ్ కోబ్రా బుసలు కొడుతున్నా భయపడకుండా దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాదాపు 20 నిమిషాల పాటు ప్రయత్నించి.. సురక్షితంగా పట్టుకున్నాడు. పాము తన దవడ తెరిచి ముందుకు సాగుతున్న సమయంలో మెరుపువేగంతో చేతులతో దాని మెడ పట్టుకున్నాడు. కింగ్ కోబ్రా 4.5 మీటర్ల పొడవు, 10 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు అటవీ అధికారులు. అనంతరం దానిని అడవిలో సురక్షితంగా వదిలిపెట్టాడు. నౌహడ్ కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాములను పట్టుకునేందుకు ఎవ్వరూ ఇలాంటి సాహసం చేయొద్దని నౌహడ్ సూచించారు.

మరిన్ని వార్తల కోసం

జెట్​ కోసం అమెరికా టెన్షన్​

కరోనా కన్నా ప్రమాదకరంగా కొత్త వైరస్