లక్కీడ్రాలో కారు వచ్చిందని 28 లక్షలు కొట్టేసిండు

  •     లక్కీడ్రాలో కారు వచ్చిందని 28 లక్షలు కాజేసిండు
  •     నిందితుడిని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు 
  •     రూ.3.50 లక్షలు సీజ్,  రూ.29 లక్షలు ఫ్రీజ్

నేరెడ్​మెట్, వెలుగు: లక్కీడ్రాలో కారు వచ్చిందంటూ జనాన్ని మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 3.50 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.29 లక్షలను ఫ్రీజ్ చేశారు. 4 సెల్ ఫోన్లు, 9 సిమ్ కార్డులు, 2 డెబిట్ కార్డులు, 5 పాస్ బుక్స్, 4 చెక్ బుక్స్, 4 ఆర్సీలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శుక్రవారం కమిషనరేట్​లో సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. తిరుమలగిరిలో ఉంటున్న వెంకాయమ్మ.. తన భర్త చనిపోగా వచ్చిన డబ్బును బిడ్డ పెండ్లి కోసం బ్యాంకులో వేసింది. పోయినేడాది ఆగస్టులో ఆమె కూతురు ఆన్ లైన్ లో ఇయర్ ఫోన్స్ ఆర్డర్ చేసింది. అదే నెల 30న 99105 86754, 97487 15075 నంబర్ల నుంచి అశోక్ అనే పేరుతో ఓ వ్యక్తి కాల్ చేసి.. రూ.15 లక్షల విలువైన కారు లాటరీలో తలిగిందంటూ నమ్మించాడు. ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ చార్జీల కోసం డబ్బులు పంపించాలన్నాడు.

అది నమ్మిన వెంకాయమ్మ కూతురు.. తల్లికి తెలియకుండా నిందితుడు అడిగినప్పుడల్లా మొత్తం రూ.28.86 లక్షలు పంపింది. కొద్ది రోజులకు వెంకాయమ్మ డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లగా, అకౌంట్​లో లేవని తెలిసింది. ఇంటికి వచ్చి బిడ్డను అడగ్గా అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. బిహార్​కు చెందిన వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించిన పోలీసులు.. అక్కడికెళ్లి నిందితుడు రాజేష్ కుమార్ మహతో(37)ను అరెస్టు చేశారు. మొత్తం 22 సైబర్ నేరాలు చేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు. రాచకొండలో 4, హైదరాబాద్​లో 6, సైబరాబాద్​లో 7, ఆసిఫాబాద్, నిర్మల్, సూర్యాపేట, న్యూఢిల్లీ, ఝాన్సీలో ఒకటి చొప్పున చేసినట్లు చెప్పాడు. నిందితుడిని రిమాండ్ కు తరలించామని, వెంకాయమ్మ డబ్బును రికవరీ చేస్తామని సీపీ తెలిపారు.