మోసం.. పోయాం మోసం అంటున్నారు ఇప్పుడు కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని బాధితులు. జనం బలహీనతలను క్యాష్ చేసుకున్నాడు ఓ వ్యక్తి. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన వేణుగోపాల్ దాస్ అనే వ్యక్తి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తానంటూ ప్రచారం చేసుకున్నాడు. అతని మాటలు నమ్మిన కొంత మంది మహిళలు.. అతనికి డబ్బులు కట్టారు.
మొదటి విడతలో భాగంగా 50 వేల రూపాయలు వసూలు చేసిన వేణుగోపాల్ దాస్.. వాళ్ల దగ్గర అని వివరాలు తీసుకున్నాడు.. ఆ తర్వాత నకిలీ తాళాలు ఇచ్చాడు.. నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చాడు. ఆన్ లైన్ కూడా రిజిస్ట్రేషన్ అవుతుంది అని చెప్పాడు.. ఈ విషయం నమ్మిన బాధితులు ఒక్కొక్కరూ లక్ష రూపాయల నుంచి 2 లక్షల 50 వేల రూపాయలు వరకు కట్టారు. తీరా అతను ఇచ్చిన డాక్యుమెంట్లు, తాళాలు తీసుకుని డబుల్ బెడ్ రూం ప్లాట్ల దగ్గరకు వెళితే.. అక్కడ వేరేవాళ్లు ఉన్నారు. దీంతో మోసపోయాం అని తెలుసుకుని.. కేపీహెచ్ బీ కాలనీ పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేశారు.
ఇందంతా పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిందని.. విడతల వారీగా డబ్బులు వసూలు చేశాడని.. ఎంపీ ఎన్నికల కోడ్ ఉందని కొన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చాడని చెప్పుకొచ్చారు బాధితులు. ఒత్తిడి చేయగా నకిలీ తాళాలు, డాక్యుమెంట్లు ఇచ్చాడని.. నిజమే అనుకుని ఆ ఇళ్ల దగ్గరకు వెళితే అక్కడ మరొకరు ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు బాధితులు. వేణుగోపాల్ దాస్ ను అరెస్ట్ చేసి తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరుతున్నారు.