కమిషనర్ పీఏనంటూ నిరుద్యోగులకు టోకరా

నవీపేట్, వెలుగు: నిజామాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​కమిషనర్ దగ్గర పీఏగా పనిచేస్తున్నానంటూ, జాబ్​లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు. మోసపోయిన బాధితులు శుక్రవారం నవీపేట పోలీస్​స్టేషన్ లో సంప్రదించారు. మండల కేంద్రానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి నగర పాలక సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించాడు. బైక్​కు మున్సిపల్ ​స్టిక్కర్ ​అంటించి, వారికి అనుమానం రాకుండా మున్సిపల్​ఆఫీసు వద్దే నిరుద్యోగులను కలిసేవాడు. 

Also Read :- TSPSC గ్రూప్ 1 పరీక్ష.. మళ్లీ రద్దుకు కారణాలేంటి?

నిజమని నమ్మిన మండలంలోని సుమారు పది మంది యువకులు రూ.50 వేల నుంచి రూ.లక్షదాకా నగదు ఇచ్చారు. శానిటేషన్​ సూపర్​వైజర్ ​పోస్టుల్లో సర్దుబాటు చేశానని సిటీలో తిప్పి, జియోట్యాగింగ్​ కోసమంటూ సెల్​ఫోన్​లో ఫొటోలు కూడా తీశాడు. నెల గడిచాక జీతం గురించి అడుగగా తప్పించుకుంటున్నాడు. చివరకు అతడి జాడ తెలియకపోవడంతో సురేశ్​అనే బాధితుడి ఆధ్వర్యంలో పలువురు పోలీసు స్టేషన్​కు వచ్చారు. నిజామాబాద్​4వ టౌన్​వెళ్లమని ఎస్ఐ యాదగిరిగౌడ్ వారికి సూచించి  పంపారు.