- ఆయనపై చర్యలు తీసుకోవాలని నోట్
- ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
- కామారెడ్డి జిల్లా అంబారీపేటలో ఘటన
కామారెడ్డి, వెలుగు: తమ భూమిని గ్రామ సర్పంచేకబ్జా చేశాడని ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా అంబారీపేటలో చోటుచేసుకుంది. అంబారీపేట గ్రామానికి చెందిన పుట్ట వెంకటయ్యకు కొడుకు బాల్‌చంద్రం(38), కూతుళ్లు లహరి, సరిత ఉన్నారు. ఈ ఫ్యామిలీకి గ్రామ పంచాయతీ సమీపంలోనే 2 ఎకరాల 30 గుంటల అగ్రికల్చర్ల్యాండ్ ఉంది. పంచాయతీ ఆఫీసుకు అతి దగ్గరగా ఉన్న 250 గజాల స్థలాన్ని ఊరికోసం ఇవ్వాలని సర్పంచ్ సలీం వెంకటయ్యను అడిగాడు. ఆ స్థలానికి బదులుగా మరో చోట భూమి ఇప్పిస్తామని చెప్పారు. అది నమ్మిన వెంకటయ్య 250 గజాలను సలీం పేరిట రాసిచ్చాడు. అయితే, దానికి బదులు వేరే చోట స్థలం ఇస్తామన్న హామీని సర్పంచ్ నిలబెట్టుకోలేదు.
దాంతో మోసపోయామని గ్రహించిన వెంకటయ్య ఫ్యామిలీ మెంబర్స్ ఆగ్రహానికి గురయ్యారు. వెంకటయ్య కొడుకు బాల్‌చంద్రం సర్పంచ్ కు ఇచ్చిన 250 గజాల స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించాడు. కానీ సర్పంచ్ అనుచరులు అతన్ని ఆ స్థలంతో పాటు సొంత పొలంలోకి కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థలం కబ్జాకు గురికావటం, సొంత అగ్రికల్చర్ భూమిని సాగు చేయకుండా సర్పంచ్ అడ్డుకోవటంతో బాల్‌చంద్రం కలత చెందాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫ్యామిలీ మెంబర్స్ వెతకగా గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని వేళాడుతూ కనిపించాడు. మృతునికి భార్య సుగుణ, బిడ్డ హిందుశ్రీ, కొడుకు శ్రీకర్ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు చెప్పినా పట్టించుకోలే..
ఆత్మహత్యకు ముందు పుట్ట బాల్‌చంద్రం గ్రామ పెద్దలకు వాట్సప్ ద్వారా సూసైడ్ నోట్ పంపాడు. సర్పంచ్ తో పాటు అతని అనుచరులే తన ఆత్మహత్యకు కారణమని అందులో వివరించాడు. తన స్థలం కబ్జా విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌కు చెప్పినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఫ్యామిలీకి సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. భూమిని కబ్జా చేసిన వాళ్లు తప్పించుకోకుండా చూడాలని వాట్సాప్ మేసేజ్ ద్వారా కోరాడు. కాగా.. బాల్‌చంద్రం ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులపై చర్య తీసుకోవాలని అతని బంధువులు ఆందోళకు దిగారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఘటన స్థలానికి కామారెడ్డి డీఎస్పీ ప్రకాశ్వెళ్లారు. మృతుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అనంతరం డెడ్ బాడీకి పోస్టుమార్టం జరిపించి ఫ్యామిలీకి అప్పగించారు. బాల్‌చంద్రం తండ్రి వెంకటరయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. సర్పంచ్ సలీం, అతని తమ్ముడు సద్దాం, దాసరి నర్సింలు, పుట్ట శ్రీనివాస్, పుట్ట బాలనర్సు, పుట్ట రమేశ్‌ల పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు పేర్కొన్నారు.