భార్య, అత్త వేధింపులు.. భర్త సూసైడ్‌‌

భార్య, అత్త వేధింపులు.. భర్త సూసైడ్‌‌
  • ఉత్తరప్రదేశ్‌‌లోని ఇటావాలో ఘటన
  • న్యాయం జరగకపోతే తన అస్థికలను కాల్వలో కలపాలని తల్లిదండ్రులకు వినతి

లక్నో: భార్య, అత్త వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌‌లోని ఇటావా ప్రాంతంలో జరిగింది. తాను చనిపోయిన తర్వాత న్యాయం జరగకపోతే తన అస్థికలను కాల్వలో కలపాలని వీడియో తీసుకొని, కుటుంబసభ్యులకు పంపి ఉరివేసుకున్నాడు. అసలేం జరిగిందంటే.. మోహిత్‌‌ యాదవ్‌‌ ఓ సిమెంట్‌‌ కంపెనీలో ఫీల్డ్‌‌ ఇంజినీర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ప్రియా అనే యువతితో ఏడేండ్లుగా రిలేషన్‌‌షిప్‌‌లో ఉన్నాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబసభ్యులను ఒప్పించి 2023లో పెళ్లి చేసుకున్నారు. 

ఆ తర్వాత దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇటావాలోని ఓ హోటల్‌‌లోకి వెళ్లి, భార్య తరఫు వారు తనను బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ వీడియోను రికార్డు చేసుకొని, ఉరి వేసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం రూమ్‌‌ నుంచి మోహిత్ బయటకు రాకపోవడంతో హోటల్‌‌ సిబ్బంది వెళ్లి చూడగా, ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ‘‘నా భార్య ప్రియ, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. రెండు నెలల క్రితం ఆమెకు బిహార్‌‌‌‌లో ప్రైవేటు టీచర్‌‌‌‌గా జాబ్ వచ్చింది. ప్రస్తుతం ప్రియ ప్రెగ్నెంట్‌‌. అయితే, నా భార్యకు ఆమె తల్లి అబార్షన్‌‌ చేయించింది. ప్రియ నగలను కూడా ఆమె తల్లి తన వద్దే పెట్టుకుంది.

పెళ్లి సమయంలో ఒక్క రూపాయి కూడా నేను కట్నం తీసుకోలేదు. కానీ, నాపై, నా కుటుంబసభ్యులపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మా ఇల్లు, ఆస్తులను తన పేరు మీద రాయాలని, లేకపోతే వరకట్న కేసులో ఇరికిస్తానని నా భార్య బెదిరిస్తోంది. ఆమె తండ్రి మనోజ్ కుమార్‌‌‌‌ నాపై తప్పుడు ఫిర్యాదు చేశాడు. ఆమె సోదరుడు కూడా నన్ను చంపేస్తానని బెదిరించాడు. నా మరణం తర్వాత కూడా న్యాయం జరగకపోతే నా అస్థికలను కాల్వలో కలపండి”అని వీడియోలో కోరాడు. చివరగా మోహిత్‌‌ యాదవ్‌‌ తన తల్లిదండ్రులకు క్షమాపణ చెబుతూ వీడియో ముగించాడు. అలాగే, మహిళలు దాఖలు చేసే తప్పుడు ఫిర్యాదుల నుంచి పురుషులను రక్షించడానికి చట్టం లేకపోవడాన్ని కూడా అతను ప్రస్తావించాడు. మగవారి కోసం కూడా ఒక చట్టం ఉంటే నేను సూసైడ్ చేసుకునే వాడిని కాదు అని పేర్కొన్నాడు.