చొప్పదండి, వెలుగు : ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చొప్పదండి పట్టణంలోని బాలాజీనగర్‌కు చెందిన మురుకుట్ల రమేశ్ (49) లారీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షలు లోన్ తీసుకొని ఒక లారీ కొన్నాడు. సంవత్సరం తర్వాత రూ. 12 లక్షలు లోన్ తీసుకొని మరో లారీ కొనుగోలు చేశాడు. లోన్‌కు సంబంధించిన ఇన్‌స్టాల్‌మెంట్లను రెగ్యులర్‌గా కడుతున్నాడు. రెండు నెలలుగా వర్షాల కారణంగా లారీలు సరిగా నడవకపోవడంతో డబ్బులు లేక ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేకపోయాడు.
దీంతో సదరు ఫైనాన్స్ కంపెనీ వ్యక్తులు గురువారం రమేశ్ ఇంటికి వచ్చి ఇన్‌స్టాల్‌మెంట్లు ఎందుకు కట్టడం లేదంటూ గొడవ చేయడమే కాకుండా అవమానకరంగా మాట్లాడారు. ఈఎంఐ కట్టకపోతే లారీలను తీసుకెళ్తామని బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన రమేశ్ గురువారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులుకు వెంటనే కరీంనగర్‌లోని హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శనివారం చనిపోయాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు చొప్పదండి ఎస్సై అనూష తెలిపారు.