అల్వాల్, వెలుగు : భూ వివాదంలో బీఆర్ఎస్ నేత వేధింపులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అల్వాల్ పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. అల్వాల్ కు చెందిన ఆంజనేయులు(46) ప్రింటింగ్ ప్రెస్ లో పని చేస్తుంటాడు. జవహర్ నగర్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్ ఓ భూమి విషయంలో రూ. 6 లక్షలు ఆంజనేయులుకు ఇవ్వాల్సి ఉంది. బీఆర్ఎస్ నేత డబ్బులు ఇస్తానని పిలిచి రూ. 3 లక్షలు ఆంజనేయులు చేతిలో పెట్టి ఫోటోలు తీసుకున్నాడు. ఆపై అతని అనుచరులతో దాడి చేయించి డబ్బులు లాక్కున్నారు.
ఆపై ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ కత్తితో బెదిరించడంతో ఆంజనేయులు తీవ్ర భయాందోళనకు గురైన జవహర్ నగర్ పోలీసులను ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా బీఆర్ఎస్ నేత అనుచరులకు సపోర్ట్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆంజనేయులు గురువారం ఉదయం 11 గంటలకు ఇంట్లో బాత్రూంలో యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు చూసి వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
యాసిడ్ తాగడానికి కారణాలను ఆంజనేయులును ఆస్పత్రికి తీసుకెళ్తున్నప్పు డు బంధువులు అడిగి రికార్డ్ చేశారు. తను యాసిడ్ తాగడానికి కొండల్ ముదిరాజు దాడి చేయడంతో చనిపోయేందుకు నిర్ణయించుకున్నట్టు ఆంజనేయులు మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేత కొండల్ నే మృతికి కారణమంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఫిర్యాదు చేయగా అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అత్తింటోళ్ల బెదిరింపులతో అల్లుడు..
జీడిమెట్ల: జగద్గిరిగుట్ట పరిధి భూదేవి హిల్స్ కు చెందిన ప్రైవేట్ ఎంప్లాయ్ చిలుకా శివసాగర్(32), చామంతికి మూడేండ్ల కిందట పెండ్లి అయింది. అప్పటి నుంచి అత్తింటోళ్లు వేరు కాపురం పెట్టాలని అల్లుడిపై ఒత్తిడి చేస్తుండగా ఒప్పుకోవడంలేదు. దీంతో 4 నెలల కిందట భార్యతో పాటు అత్తింటోళ్లు అతడిపై కేసు పెట్టారు. ఆపై బామ్మర్దులు, బంధువులు కలిసి శివసాగర్ ఇంటిపై దాడి చేసి కొట్టడడంతో కేసు పెట్టారు. అనంతరం కేసు వాపసు తీసుకోవాలని బెదిరిస్తున్నారు. దీంతో మనస్తాపం చెందిన శివసాగర్ ఈనెల5న అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడని, తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని జగద్గిరిగుట్ట సీఐ క్రాంతికుమార్ తెలిపారు.