నర్సాపూర్, వెలుగు : తండ్రి ట్రీట్‌మెంట్‌కు అయిన అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అర్జున్ తండాకు చెందిన హలావత్ రాజు (41) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. తన తండ్రి లచ్చయ్యకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ట్రీట్‌మెంట్ కోసం పలు హాస్పిటల్స్ తిరిగాడు. ఇందుకోసం రూ. 4 లక్షల వరకు అప్పు అయింది. దీంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక కొన్ని రోజులుగా మనోవేదనకు గురయ్యాడు.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి బయటకు వెళ్లి వస్తానని భార్య లక్ష్మికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఉదయం ఆరు గంటల టైంలో తమ పొలంలో ఉన్న చెట్టుకు శ్రీనివాస్ ఉరి వేసుకొని కనిపించాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై లింగం తెలిపారు.
అప్పుల బాధతో రైతు..
తొర్రూరు (పెద్దవంగర), వెలుగు : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లికి చెందిన కోటగిరి శ్రీనివాస్ (42) తనకున్న రెండు ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులు, సొంత ఇంటి కోసం గతంలో కొంత అప్పు చేశాడు. వ్యవసాయ దిగుబడులు అంతంతమాత్రంగానే ఉండడంతో అప్పు ఎలా తీర్చాలో తెలియక పొలం వద్ద శుక్రవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తొర్రూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా అక్కడ ట్రీట్‌మెంట్‌తీసుకుంటూ శనివారం చనిపోయాడు. మృతుడి భార్య రజిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.