
ఫేస్ బుక్ లో సరదాగా చాట్ చేస్తూ ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. సదరు అమ్మాయిది పాకిస్థాన్ అని తెలిసి కూడా లవ్ లో పాడ్డాడు. తన ఆన్ లైన్ క్రష్ ను ఎలాగైనా కలవాలని సాహసం చేసి ఇండియా-పాకిస్తాన్ బార్డర్ దాటాడు. సినిమా ట్రాజెడీని తలపిస్తున్న లవ్ స్టోరీలో ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చదవాల్సిందే.
ఉత్తరప్రదేశ్ అలీఘర్ కు చెందిన బాదల్ బాబు (20) పాకిస్థాన్ కు చెందిన సనా రాణితో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె కోసం ఏదైనా చేసేంతలా డీప్ గా ప్రేమలో పడ్డాడు. లవర్ ను కలుసుకునేందుకు ప్రణాలకు తెగించి అట్టారీ-వాఘా బార్డర్ దాటాడు. తన లవర్ హృదయాన్ని గెలుచుకోవడం కోసం ఇస్లాం మతంలోకి మారి రెహాన్ గా పేరు మార్చుకున్నాడు. అలాగైతే సనాను పెళ్లి చేసుకునేందుకు అడ్డంకులు ఉండవని భావించాడు.
అయితే రెహాన్ (బాదల్ బాబు) ప్రపోజల్ ను సనా రిజెక్ట్ చేయడంతో ఆశలు ఆవిరయ్యాయి. దేశం కాని దేశంలో.. ఎవరూ తెలియని పరిస్థితుల్లో.. చివరికి తన లవర్ సనా ఇంటికి దగ్గర్లో మండి బహౌద్దీన్ ప్రాంతంలో ఒక వ్యక్తి దగ్గర గొర్ల కాపరిగా పనికి కుదిరాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు 27 డిసెంబర్, 2024లో అరెస్టయ్యాడు. తనది కరాచీ అని, తనకెవరూ లేరని తప్పుడు సక్షాలు ఇచ్చినందుకు పోలీసులు అరెస్టు చేశారు.
అమాయక బాదల్ బాబు కథ విని మానవతా హృదయంతో ఒక లాయర్ వాదించడానికి ఒప్పుకున్నాడు. కేసు వాదనలో భాగంగా తన క్లయింట్ అమాయకుడని, లౌక్యం తెలియని పరిస్థితుల్లో దేశం దాటి వచ్చాడని, మతం మార్చుకోవడంతో తిరిగి ఇండియా వెళ్లాలంటే భయపడి ఇక్కడే ఉండిపోయాడని లాయర్ కోర్టుకు తెలిపాడు. బాదల్ తన వద్దకు ఎలా వచ్చాడో అతని యజమాని హజీ ఖాన్ అస్గర్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. తను అమ్మాయితో ప్రేమలో పడి.. జీవితం అంటే తెలియని వయసులో ఏదో ఊహించుకుని బార్డర్ దాటాడని, ఆమె రిజెక్ట్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డాడని తెలిపాడు.
అయితే మొదట్లో సనా, ఆమె తల్లి ఇద్దరూ బాదల్ ను ఇంటికి ఆహ్వానించారని, కానీ అతని గురించి వివరాలు తెలుసుకుని తిరస్కరించారని, అతన్ని జైలు పాలు చేశారని అస్గర్ తెలిపాడు.
‘‘ఇటీవలే బాదల్ ను ఇండియాలో ఉన్న తన తల్లిదండ్రులతో మాట్లాడించాం. అక్రమంగా పాక్ కు ప్రవేశించిన బాదల్ కేసు విచారణలో ఉంది. అతని అమాయకత్వాన్ని పరిగణించి త్వరలోనే విడుదల చేస్తారు. ఈ నెలాఖరులో బాదల్ తదుపరి విచారణ ఉంది.’’ అని లాయర్ ఫయాజ్ రమయ్ తెలిపారు.