లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను చంపేస్తానని 112కు డయల్ చేసి బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ‘‘వచ్చే జనవరి 26న యోగిని కాల్చి చంపుతామని అనిల్ అనే వ్యక్తి మంగళవారం రాత్రి ఎమర్జెన్సీ నంబర్ 112కు ఫోన్ చేశాడు. అలాగే, ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)ను అతను బెదిరించాడు. వెంటనే కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేపట్టగా అప్పటికే అతను ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడు. రాత్రంతా నిందితుడి కోసం గాలించగా, అతని లొకేషన్‌ను కనుక్కున్నాం. అనంతరం బుధవారం అనిల్‌ను అరెస్ట్ చేశాం”అని ఎస్‌హెచ్‌వో వెల్లడించారు.
ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితుడు ఫోన్ కాల్ బెదిరింపుతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే, నిందితుడు ఎందుకు ఫోన్ చేశాడు.. అతని మానసిక పరిస్థితిని కూడా తెలుసుకుంటామన్నారు. కాగా, తన ఫ్రెండ్ తన బైక్ తీసుకొని, తిరిగి ఇవ్వడం లేదంటూ మంగళవారం సాయంత్రం స్థానిక పీఆర్వీ టీమ్‌కు అనిల్ ఫిర్యాదు చేశాడు. దీనిపై ఆ టీమ్ అతన్ని ప్రశ్నించగా, వారిని తిట్టడంతో పాటు బెదిరించాడు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో 112కు ఫోన్ చేసి సీఎంను చంపేస్తానని బెదిరించాడు.