
తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల ఓ వ్యక్తి భక్తులను పేల్చి చంపేస్తా అంటూ తిరుమల కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేశాడు. దీంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బెదిరింవు కాల్ చేసిన వ్యక్తిని తిరుపతిలో అరెస్టు చేశారు. నిందితుడిని తమిళనాడులోని సేలంకు చెందిన బి బాలాజీగా గుర్తించారు.
2023 ఆగస్టు 15వ తేదీ ఉదయం 11.25 గంటల ప్రాంతంలో అలిపిరిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు ఫోన్ కాల్ చేశాడు. అలిపిరి వద్ద బాంబు పేలుస్తానని , బాంబు పేలుడు వల్ల కనీసం 100 మంది భక్తులు చనిపోవచ్చు అంటూ హెచ్చరించాడు. దీంతో పోలీసులుఅలిపిరి చెక్‌పోస్టు వద్ద పూర్తి తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఫోన్ కాల్ పై టీటీడీకి చెందిన విజిలెన్స్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి ఆ ఫోన్ కాల్ ఫేక్ అని తేల్చారు. నిందితుడు బాలాజీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.