లవర్​కు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. బిల్డింగ్​ పై నుంచి పడి యువకుడి మృతి

  •     బోరబండలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

హైదరాబాద్, వెలుగు: లవర్​కు పిజ్జా ఇచ్చేందుకు వెళ్లిన ఓ యువకుడు బిల్డింగ్ పై నుంచి కిందపడి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోరబండలోని మహ్మద్ షోయబ్(19) ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. అదే ఏరియాలో ఉండే యువతితో అతడికి పరిచయం ఏర్పడింది. అయితే, ఈ నెల 6న రాత్రి సదరు యువతికి పిజ్జా ఇచ్చేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. బిల్డింగ్ 4వ అంతస్తులో టెర్రస్ పై కూర్చుని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైమ్​లో యువతి తండ్రి టెర్రస్ పైకి వచ్చాడు. భయంతో షోయబ్ 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని ఉస్మానియాకు తరలించారు. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. అతడి తండ్రి ఇచ్చిన కంప్లయింట్ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.