చిట్టీ వేసి డబ్బులడిగితే పెట్రోల్ పోసి చంపారు

హన్మకొండ: ఓ చిట్ ఫండ్ కంపెనీ మోసానికి ఓ వ్యక్తి బలయ్యాడు. ఈ ఘటన హన్మకొండలో ఈ నెల 3న జరిగింది. స్థానికంగా నివసించే రాజు అనే వ్యక్తి సెల్ ఫోన్ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రాజు స్నేహితుడు గణేష్ అచలా చిట్ ఫండ్స్ లో ఏజెంట్ గా పనిచేస్తున్నాడు. స్నేహితుడి మీద నమ్మకంతో రాజు ఓ చిట్టీ కట్టాడు. అయితే కొన్ని అనుకోని అవసరాలతో రాజు.. చిట్టీ పాడాడు. నెలలు గడుస్తున్నా.. చిట్ ఫండ్ కంపెనీ చిట్టీ డబ్బులు ఇవ్వలేదు. దాంతో రాజు.. గణేష్ ను నిలదీశాడు. అది మనసులో పెట్టుకున్న గణేష్.. తన భార్యతో కలిసి రాజు సెల్ ఫోన్ షాపుకు వచ్చి పెట్రోలో పోసి నిప్పటించారు. మంటలతో రోడ్డు మీద పరుగెడుతున్న రాజును స్థానికులు దుప్పట్లతో కప్పి ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటినుంచి చికిత్స పొందుతున్న రాజు.. ఆరోగ్యం విషమించడంతో బుధవారం సాయంత్రం మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గణేష్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. చిట్ ఫండ్ కంపెనీ తీరుపై స్థానికులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.