చెరువులో పడి వ్యక్తి మృతి..కీసర గుట్ట వద్ద ఘటన

చెరువులో పడి వ్యక్తి మృతి..కీసర గుట్ట వద్ద ఘటన

కీసర, వెలుగు: కీసర గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. బోయిన్ పల్లికి చెందిన వీరేశ్ (42) కంటోన్మెంట్‌లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, మహాశివరాత్రికి ముందు రోజు తన బామ్మర్ది, తన కుటుంబంతో కలిసి కీసర గుట్టకు వచ్చాడు. గురువారం మధ్యాహ్నం తన బామ్మర్ది కీసర గుట్ట కింద ఉన్న చెరువు వద్దకు వెళ్లి కుక్క పిల్లకు స్నానం చేయిస్తుండగా, వీరేశ్ అక్కడికి వెళ్లాడు. 

ఈ చెరువు ఒడ్డున కిందపడడంతో అతని ఎడమ చేతికి గాయమైంది. దీంతో చేతిని కడుక్కోవడానికి చెరువులోకి దిగి, ఈత కొడుతుండగా ఒక్కసారిగా మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న కీసర సీఐ శ్రీనివాస్, డిజాస్టర్ టీం సంఘటన స్థలానికి చేరుకొని వీరేశ్ మృతదేహాన్ని వెలికితీశారు. గాంధీ దవాఖానకు పోస్టుమార్టం. అయితే, చెరువులో పడిన వీరేశ్ మృతదేహాన్ని బయటకు తీయడానికి వచ్చిన ఫైర్ అండ్ డిజాస్టర్ వాహనం చెరువు వద్దకు వెళ్లే సమయంలో కరెంట్ పోల్ ను ఢీకొట్టింది. ఫైర్ వాహనంలో ఉన్న ముగ్గురికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

చెరువులో శవమై తేలిన డాక్టర్

జీడిమెట్ల: సూరారం పరిధిలో కన్పించకుండా పోయిన వైద్యుడు చెరువులో శవమై తేలాడు. మెట్టుకాని గూడ స్పెండ్‌డిడ్‌ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఎం.విజయభాస్కర్‌ నిమ్స్‌లో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు సూరారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

 కాగా, గురువారం కట్టమైసమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తిని విజయభాస్కర్‌గా పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని. డెడ్బాడీని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.