వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..

వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..

ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉందని వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టడంతో ఓ పేషంట్ మృతిచెందిన దారుణ ఘటన రాజస్థాన్ లో జరిగింది. కోటాకు చెందిన 40 ఏళ్ల ఒక వ్యక్తి కరోనా అనుమానంతో జూన్ 13న మహారావ్ భీమ్ సింగ్ ఆస్పత్రిలోని ఐసీయూలో చేరాడు. అతనికి కరోనా పరీక్ష చేస్తే నెగిటివ్ వచ్చింది. అయితే అదే వార్డులో ఉన్న మరో పేషంట్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో నెగిటివ్ వచ్చిన వ్యక్తిని జూన్ 15న ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కాగా.. ఐసోలేషన్ వార్డులో వేడిగా ఉండటంతో కుటుంబసభ్యులు కూలర్ పెట్టాలని అనుకున్నారు. వెంటనే ఒక కొత్త కూలర్ కొని ఐసోలేషన్ వార్డుకు తీసుకువచ్చారు. అయితే ఐసోలేషన్ వార్డులో కూలర్ పెట్టడం కోసం మరో సాకెట్ లేకపోవడంతో వారు వెంటిలేటర్‌ ప్లగ్ ను సాకెట్ నుంచి తీసి కూలర్ ప్లగ్ పెట్టారు. అలా పెట్టిన అరగంట తర్వాత వెంటిలేటర్ పూర్తిగా ఆగిపోయింది. వెంటనే పేషంట్ బంధువులు వైద్యసిబ్బందికి సమాచారమిచ్చారు. వారు వచ్చి రోగికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే పేషంట్ ఊపిరాడక మృతిచెందాడు.

ఈ సంఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేస్తుందని ఆస్పత్రి అధికారులు తెలిపారు. డిప్యూటీ సూపరింటెండెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, డ్యూటీలో ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో కూడిన కమిటీ ఈ సంఘటనపై దర్యాప్తు చేసి శనివారం నివేదికను సమర్పిస్తుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ సక్సేనా తెలిపారు. ఈ కమిటీ ఐసోలేషన్ వార్డులో డ్యూటీలో ఉన్న స్టాఫ్ నుంచి వివరాలను సేకరించింది. అయితే రోగి యొక్క కుటుంబ సభ్యులు మాత్రం కమిటీ ఇచ్చిన సమాచారంపై స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. దర్యాప్తు నివేదికలో ఎవరు బాధ్యులని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా కుటుంబ సభ్యులు కూలర్‌ను ప్లగ్ చేయడానికి ఆస్పత్రి సిబ్బంది నుంచి అనుమతి తీసుకోలేదని.. అంతేకాకుండా వారు పేషంట్ చనిపోయిన తర్వాత వైద్య సిబ్బందితో మరియు విధుల్లో ఉన్న డాక్టర్ తో గొడవపడ్డారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

For More News..

సర్కార్ సీడ్సే మొలకలొస్తలేవ్