హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీ కోసం వెళ్లిన ఓ వ్యక్తిని దొంగగా భావించి అక్కడున్నవాళ్లు చితకబాదారు. దీంతో ఆ దెబ్బలతో వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మొఘల్స్ పారడైస్ అనే రెస్టారెంట్లో చోటు చేసుకుంది. ప్రగతి నగర్ లో భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్న రాజేష్(32) గత అర్థరాత్రి బిర్యానీ కోసం రెస్టారెంట్ సెల్లార్ లోకి వెళ్లాడు. దీంతో అతడ్ని దొంగగా భావించిన హోటల్ సిబ్బంది పట్టుకొని చితక్కొట్టారు. అక్కడే అతడ్ని వదిలేసి వెళ్లిపోయారు. ఈరోజు ఉదయం అపస్మారక స్థితిలో రాజేష్ ను చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు హోటల్ సిబ్బంది. దీంతో ఇంటికి వెళ్లిన కాసేపటికే అతడు మృతి చెందాడు. హోటల్ సిబ్బంది విచక్షణా రహితంగా దాడి చేయడం వల్లే రాజేష్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.