
- డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ధర్నా
- సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
సంగారెడ్డి, వెలుగు : గురక సమస్యను పరిష్కరించాలని ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముక్కులో బోన్ పెరిగిందని ఆపరేషన్ చేసిన డాక్టర్లు... చివరకు ఆ వ్యక్తి చనిపోయాడని చెప్పారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే అతడు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల వివరాలు ప్రకారం... కొండాపూర్ మండలం గారకుర్తి గ్రామానికి చెందిన వెంటూరి శ్రీనివాస్ (47) గురక సమస్యను పరిష్కరించాలని బుధవారం సంగారెడ్డిలోని పద్మావతి న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు వచ్చాడు.
అతడిని పరీక్షించిన డాక్టర్లు ముక్కులో బోన్ పెరిగిందని, సర్జరీ చేస్తే సెట్ అవుతుందని చెప్పారు. దీంతో ఇంత చిన్న సమస్యకు ఆపరేషన్ ఎందుకని శ్రీనివాస్ కుటుంబసభ్యులు అభ్యంతరం చేప్పినా... ఆపరేషన్ చేస్తే గురక తగ్గుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు. దీంతో బుధవారం రాత్రి శ్రీనివాస్‌కు ఆపరేషన్ చేశారు.
రాత్రి 2 గంటల టైంలో శ్రీనివాస్ గుండెపోటుతో చనిపోయాడంటూ డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ఎలా చనిపోతాడని మృతుడి కుటుంబ సభ్యులు డాక్టర్లను నిలదీశారు.
డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శ్రీనివాస్ చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు గురువారం ఉదయం హాస్పిటల్ ఎదుట ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.