
- మద్యం తాగుతూ షాపులోనే వ్యక్తి మృతి
- మృతిపై అనుమానం ఉందని ఆందోళనకు దిగిన బంధువులు
లోకేశ్వరం, వెలుగు : నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని ఓ వైన్స్‌లో వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. అతిగా మద్యం తాగి చనిపోయినట్లు వైన్స్ సిబ్బంది చెబుతుండగా, మృతిపై అనుమానాలు ఉన్నాయని మృతుడి బంధువులు డెడ్‌బాడీతో వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. మండల కేంద్రానికి చెందిన పోతరాజు ప్రశాంత్ (32) మంగళవారం ఉదయం మద్యం తాగేందుకు స్థానిక లక్కీ వైన్స్‌కు వచ్చాడు. సాయంత్రం 4 గంటల టైంలో ప్రశాంత్ చనిపోయినట్లు వైన్స్ సిబ్బంది పోలీసులతో పాటు, మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి డెడ్‌బాడీని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ప్రశాంత్ ముక్కు నుంచి రక్తం కారిందని, అతడి అనుమానాలు ఉన్నాయని మృతుడి బంధువులు బుధవారం డెడ్‌బాడీతో వైన్స్ ఎదుట ఆందోళనకు దిగారు. వైన్స్‌లోని సీసీ ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేయగా మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫుటేజీ మిస్ అయిందని వైన్స్ సిబ్బంది చెప్పడంతో మృతుడి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత్ మృతిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్థానిక నాయకులు కల్పించుకొని వైన్స్ ఓనర్‌తో మాట్లాడి మృతుడి ఫ్యామిలీకి ఆర్థికసాయం అందజేసేందుకు హామీ ఇచ్చారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు చెప్పారు.