మెదక్‌ జిల్లాలో దారుణం:వదినతో వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. అన్నకు కరెంట్ షాక్​ పెట్టి చంపిండు

  • నిందితుడి అరెస్టు 

శివ్వంపేట, వెలుగు: వదినతో వివాహేతర సంబంధానికి అడ్డు తగలడంతో పాటు ఆమెను దూరం చేశాడన్న కోపంతో ఓ వ్యక్తి తన అన్నకు కరెంట్‌‌ షాక్‌‌ పెట్టి చంపేశాడు. ఈ ఘటన మెదక్​జిల్లా శివ్వంపేట మండలం బిక్యాతండా పంచాయతీ పరిధిలోని నామ్యాతండాలో జరిగింది. తండాకు చెందిన చందర్‌‌ కు ఇద్దరు కొడుకులు శంకర్‌‌ (28), గోపాల్ ​ఉన్నారు. శంకర్‌‌ హైదరాబాద్‌‌లో పని చేస్తూ ఏడాది కింద లలిత అనే యువతిని ప్రేమించి పెండ్లి చేసుకొని గ్రామానికి తీసుకొచ్చాడు.

కొన్ని రోజుల తర్వాత లలితకు మరిది గోపాల్‌‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలియడంతో శంకర్‌‌ ఇద్దరినీ మందలించాడు. అయినా వారిలో మార్పు రాకపోవడంతో శంకర్‌‌ తన తమ్ముడు గోపాల్‌‌తో గొడవ పడి కొట్టాడు. తర్వాత పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా, వారి ఇంటి నుంచి  లలిత వెళ్లిపోయింది. దీంతో తమను విడదీశాడని కోపం పెంచుకున్న గోపాల్‌‌.. అన్నను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చిన గోపాల్‌‌.. తన అన్న శంకర్‌‌ మద్యం మత్తులో పడుకొని ఉండడాన్ని గమనించి హత్య చేసేందుకు ప్లాన్‌‌ చేశాడు. తన గదిలో ఉన్న కరెంట్‌‌ వైర్లను తీసుకొచ్చి శంకర్‌‌ కాలుకు, చేయికి చుట్టి ప్లగ్‌‌లో పెట్టి స్విచ్‌‌ ఆన్‌‌ చేశాడు. దీంతో షాక్‌‌ కొట్టి శంకర్‌‌ అరవడంతో అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా శంకర్‌‌ అప్పటికే చనిపోయాడు. తండ్రి చందర్‌‌ ఫిర్యాదు మేరకు  పోలీసులు గోపాల్‌‌ను అరెస్ట్‌‌  చేశారు.