
- రైతుల ప్రాణాలు తీసిన ప్రమాదాలు
- సంగారెడ్డి జిల్లా తుమ్మన్‌పల్లి సమీపంలో బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
- శవంతో రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
- సిరిసిల్ల జిల్లాలో బైక్ అదుపు తప్పి మరో రైతు మృతి
ఝరాసంగం, వెలుగు : సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో గురువారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు రైతులు కన్నుమూశారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని తుమ్మన్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ అన్నదాత చనిపోయాడు. డ్రైవర్అజాగ్రత్తగా నడిపి చావుకు కారకుడయ్యాడని, బస్సును కదలనిచ్చేది లేదంటూ గ్రామస్తులు శవంతో పాటు రోడ్డుపై బైఠాయించారు. పోలీసుల కథనం ప్రకారం..తుమ్మన్పల్లికి చెందిన శేరి ఖమర్(28) ఉదయం 7 గంటలకు పశువుల పేడ గంపలో వేసుకుని రోడ్డు పక్కనున్న పెంటలో వేసి తిరిగి వస్తుండగా జహీరాబాద్ నుంచి కోడూర్వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఖమర్ కిందపడిపోగా మీది నుంచి బస్సు దూసుకెళ్లడంతో అక్కడికకక్కడే కన్నుమూశాడు.
విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు బస్సును కదలనిచ్చేది లేదని శవంతో ఆందోళన చేశారు. దీంతో జహీరాబాద్ రూరల్ సీఐ నోముల వెంకటేశం, ఎస్ఐ రాజేందర్‌రెడ్డి అక్కడికి వచ్చి అందోళనకారులకు నచ్చజెప్పారు. తర్వాత శవాన్ని పోస్ట్‌మార్టం కోసం జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య నేహాగోరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చనిపోయిన వ్యక్తికి ఐదు నెలల కొడుకు ఉన్నట్టు కుటుంసభ్యులు తెలిపారు.
బైక్ అదుపు తప్పి..
కోనరావుపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్‌లో గురువారం ఓ రైతు పొలం పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి పొలంలో పడి చనిపోయాడు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. కొండాపూర్‌కు చెందిన పిట్టల రమేశ్ (42) వ్యవసాయం చేస్తుంటాడు. గురువారం పొలానికి వెళ్లి ఇంటికి వస్తుండగా కొండాపూర్ స్టేజ్ సమీపంలో బైక్ అదుపుతప్పి పొలంలో పడిపోయాడు. తలకు బలమైన దెబ్బ తాకడంతో అక్కడిక్కడే చనిపోయాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య రేణుక, కొడుకు శరత్, కూతురు శరణ్య ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.