మొగుళ్లపల్లి, వెలుగు : మద్యం మత్తులో, ఇంట్లో వాళ్లతో గొడవపడి ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పంటించుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన పోచంపల్లి కొమురయ్య (56) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
ఈయనకు ముగ్గురు కొడుకులు. మంగళవారం పిడిసిల్ల గ్రామంలో బంధువు చనిపోగా అంత్యక్రియలకు హాజరై తర్వాత మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీంతో ‘ఇలా మద్యం తాగితే ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది.. ఎన్నిసార్లు చెప్పినా మానుతలేవు’ అని కొమురయ్య భార్య దేవేంద్ర మందలించింది.
తర్వాత అదే గ్రామంలో ఉంటున్న తన పెద్ద కొడుకు ఇంటికి వెళ్లింది. రాత్రి 9 గంటలకు ఇద్దరు కొడుకులతో వచ్చి ఇంట్లో పడుకుంది. ఇంటి బయట పడుకున్న కొమురయ్య అర్ధరాత్రి 11.30 గంటల టైంలో టాటా ఏస్ వెహికల్ కోసం తెచ్చిన డీజిల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అరుపులు విన్న కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూసే సరికే కొమురయ్య చనిపోయాడు. మృతుడి భార్య దేవేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ చెప్పారు.