- ఆరేండ్ల కింద రూ. 40 వేలు తీసుకున్న వ్యక్తి
- రూ. 30 వేలు కట్టినా, ఇంకా రూ. 40 వేలు బాకీ అంటూ వేధింపులు
- ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలంలో ఘటన
కాగజ్‌నగర్, వెలుగు : పర్సనల్ లోన్ డబ్బులు చెల్లించాలని బ్యాంక్ సిబ్బంది వేధించడం, కట్టకపోతే ఇంటికి తాళం వేస్తామని బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం శివపూర్‌లో జరిగింది. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కారెం సంతోష్ (33)కు భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. సంతోష్ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడేండ్ల కింద సిర్పూర్‌లోని జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ నుంచి 2018లో రూ. 40 వేలు లోన్ తీసుకున్నాడు.
ఇప్పటివరకు సుమారు రూ. 30 వేలు కట్టాడు. ఆ తర్వాత డబ్బులు కట్టకపోవడంతో వడ్డీతో కలిసి ఇంకా రూ. 40 వేలు బాకీ ఉందంటూ బ్యాంక్ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. మంగళవారం బ్యాంక్ మేనేజర్ తబస్సుమ్ సిబ్బందితో కలిసి సంతోష్ ఇంటికి వెళ్లారు. పెండింగ్‌లో ఉన్న లోన్ డబ్బులు కట్టాలని, లేకపోతే ఇంటికి తాళం వేసి, కేసు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 7.30 గంటల టైంలో బయటకు వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన సంతోష్ ఇంటికి సమీపంలో పురుగుల మందు తాగాడు.
గమనించిన స్థానికులు సంతోష్ భార్య జ్యోతికి సమాచారం ఇవ్వడంతో ఆమె స్థానికుల సాయంతో సిర్పూర్ టి సివిల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ పరీక్షించిన డాక్టర్లు సంతోష్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదుతో బ్యాంక్ మేనేజర్ తబస్సుమ్, సిబ్బందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.