
- ఐపీఎల్లో లక్ష రూపాయల వరకు నష్టం
- సూసైడ్‌కు ముందు ఫ్రెండ్స్‌కు లొకేషన్ షేర్
- మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఘటన
మేడ్చల్, వెలుగు: క్రికెట్ బెట్టింగ్‌కు మరో యువకుడు బలయ్యాడు. లక్ష రూపాయల వరకు నష్టపోవడంతో ఫ్రెండ్స్‌కు లొకేషన్ షేర్ చేసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలో మంగళవారం జరిగింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ.. 25 ఏండ్ల కింద బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కుటుంబంతో కలిసి గుండ్లపోచంపల్లిలో నివాసం ఉంటున్నాడు.
రమణ కొడుకు సోమేశ్ (29) దేవరయాంజాల్ పరిధిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటుపడిన సోమేశ్.. సోమవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు. అయితే, వాటిలో కొన్ని కంపెనీకి చెందిన డబ్బులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు ఏమంటారో అని సోమేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. డ్యూటీకి టైం అవుతున్నప్పటికీ సోమేశ్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడి ఫోన్ చేస్తే.. కాసేపు ఆగి వస్తానని చెప్పాడు.
కానీ.. స్నేహితులకు మాత్రం తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. ఫ్రెండ్స్ అందరికీ తన లోకేషన్ కూడా షేర్ చేశాడు. తర్వాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఓ స్నేహితుడు వద్దని వారించినప్పటికీ సోమేశ్ వినిపించుకోలేదు. లోకేషన్ ఆధారంగా స్పాట్‌కు వెళ్లి చూడగా.. సోమేశ్ చనిపోయి ఉన్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
గతంలోనూ రూ.3 లక్షలు పోగొట్టుకున్న సోమేశ్
నాలుగేండ్ల కింద అక్క పెండ్లి కోసం అప్పుగా తీసుకొచ్చిన రూ.3 లక్షలను బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడని అతని స్నేహితులు చెప్తున్నారు. ఆ టైమ్‌లో ఇంట్లో గొడవలు జరిగాయి. గట్టిగా బెదిరిస్తే కొడుకు ఏమైనా చేసుకుంటాడేమో అని తల్లిదండ్రులే అప్పులు తీర్చారు. అప్పటి నుంచి బెట్టింగ్ జోలికి వెళ్లలేదు. తాజాగా ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టి లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు.