ప్రియురాలికి మరొకరితో పెండ్లి కుదిరిందని..యువకుడి సూసైడ్

అమ్మాయి ఇంటి ముందు మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన

శంషాబాద్, వెలుగు: ప్రేమించిన యువతికి మరొకరితో పెండ్లి కుదిరిందనే మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన శంషాబాద్ ఎయిర్​పోర్టు పీఎస్ పరిధిలో జరిగింది. రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన సిద్ధాంతి శివ(23), ఓ యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, వీరి పెండ్లికి అమ్మాయి కుటుంబసభ్యులు ఒప్పుకోలేదు. ఆమెను మరిచిపోవాలని శివకు చెప్పారు. యువతికి మరొకరితో పెండ్లి నిశ్చయించారు. ఈ విషయం తెలుసుకున్న శివ మనస్తాపంతో మంగళవారం రాత్రి కొత్వాల్ గూడలోని పొలం వద్ద ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శివ కుటుంబసభ్యులు, గ్రామస్తులు అతడి డెడ్​బాడీతో అమ్మాయి ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. శివ మృతికి యువతి కుటుంబసభ్యులే కారణమంటూ అతడి తండ్రి చంద్రయ్య ఆరోపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎయిర్​పోర్టు పోలీసులు మృతుడి బంధువులతో మాట్లాడి వారిని అక్కడి నుంచి పంపించారు. చంద్రయ్య కంప్లయింట్​ మేరకు కేసు ఫైల్ చేసి  దర్యాప్తు చేపట్టారు.

పరిగిలో మరొకరు..

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన పరిగి పీఎస్ పరిధిలో జరిగింది. యాబాజ్ గూడెంనకు చెందిన కుమార్(29) సిటీకి వచ్చి కూలీ పనిచేస్తున్నాడు. అతడికి ఇదివరకే పెళ్లైంది. కొంతకాలంగా కుమార్ మరో యువతితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఆ యువతి తనను పెండ్లి చేసుకోవాలని కుమార్​ను అడగడంతో ఆందోళనకు గురయ్యాడు.మంగళవారం రాత్రి యాబాజ్ గూడెంలోని తన ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.