హాలియా, వెలుగు : జీతం సరిపోక దొంగతనం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాగార్జునసాగర్ సీఐ బిసన్న బుధవారం కేసు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రం సివాజ్ జిల్లా, భగవాన్ పూర్‌కు చెందిన నీరజ్ కుమార్ సింగ్ పెద్దవూర మండలంలోని సుంకిశాల ప్రాజెక్టు పైపులైన్పనుల్లో నడుస్తున్న జేసీబీ హెల్ఫర్‌గా పని చేస్తున్నాడు. అతనికి నెలకు రూ. 8 వేలు జీతం. ఇవి ఏమాత్రం సరిపోకపోవడంతో దొంతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 24 న మండలంలోని సంగారం గ్రామానికి చెందిన బైరోజు భారతమ్మ ఇంట్లోకి చొరవడి బీరువాలో ఉన్న3 బంగారు ఉంగరాలు, రూ.10 వేల నగదును ఎత్తుకెళ్లాడు.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీరజ్ కుమార్ గురువారం ఉదయం బంగారంతో హైదరాబాద్ వెళ్లేందుకు సంగారం స్టేజీ వద్ద బస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులను చూసి భయంతో పారిపోగా వెంబడించి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న బంగారు ఉంగరాలు, నగదు స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరిచారు.