రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లో పెండ్లికి గిఫ్ట్‌గా వచ్చిన హోమ్ థియేటర్ పేలి పెండ్లి కొడుకు మృతి చెందిన ఘటనలో సంచలన విషయం బయటపడింది. పెండ్లి కూతురి మాజీ లవరే కొత్త జంటను చంపేందుకు బాంబు పెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కబీర్‌ధామ్ జిల్లా చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మెరావి(22)కి ఓ యువతితో గత నెల 30న పెండ్లి జరిగింది. పెండ్లిలో కొత్త జంటకు హోమ్ థియేటర్ గిఫ్ట్ గా వచ్చింది. సోమవారం హేమేంద్ర హోమ్ థియేటర్‌ను బయటకు తీసి కరెంట్ కనెక్షన్ ఇవ్వగా.. వెంటనే అది పేలిపోయింది.
ఈ ఘటనలో కొత్త పెండ్లికొడుకు హేమేంద్ర మెరావి అక్కడికక్కడే మృతిచెందగా.. అతడి అన్న రాజ్ కుమార్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హోమ్ థియేటర్ పేలిన స్థలంలో గన్ పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. హోమ్ థియేటర్ ఎవరిచ్చారని ఆరా తీయగా.. సర్జు మార్కమ్ అనే వ్యక్తి ఈ గిఫ్ట్ తెచ్చినట్లు తేలింది. సర్జును విచారించగా.. పెళ్లికూతురు తను కొంతకాలం ప్రేమించుకున్నామని, పెళ్లి కుదరడంతో తనను దూరం పెట్టిందని సర్జు చెప్పాడన్నారు. దీంతో కొత్త జంటను చంపేందుకు హోమ్ థియేటర్లో బాంబు పెట్టి గిఫ్ట్ గా ఇచ్చినట్లు సర్జు అంగీకరించాడని పోలీసులు చెప్పారు.