తాతని చంపిన మనవడు.. తండ్రి కొడుకు పరార్

అడ్డుకోబోయిన నానమ్మకూ తీవ్ర గాయాలు

తండ్రికి, తాతకి మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగింది. అక్కడే ఉన్న మనవడు ఆవేశంలో తాతను గొడ్డలితో నరికి చంపేశాడు. ఆ దారుణాన్ని అడ్డుకోబోయిన నానమ్మనూ గొడ్డలితో గాయపరిచాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో జరిగింది.

ఆగ్రా జిల్లాలోని జసోల్పూర్ గ్రామానికి చెందిన దాల్చంద్ర పూర్వాంశి (70), రాంకాళి (68) దంపతులకు రాం శంకర్, కుల్వీర్ అనే ఇద్దరు కొడుకులు. వారిలో రాం శంకర్ తన తల్లిదండ్రులు నడుపుతున్న షాపు తనకు కావాలని పట్టుబట్టాడు. అది అప్పగించాలని కోరాడు. కానీ, అందుకు దాల్చంద్ర ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. ఈ గొడవ చూసిన రాం శంకర్ కొడుకు అమిత్ తన తాత దాల్చంద్రను గొడ్డలి తీసుకుని దారుణంగా నరికి చంపాడు. ఈ సమయంలో తన భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసిన రాం కాళిపై కూడా మనవడు అమిత్ దాడి చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఈ దారుణానికి పాల్పడిన అమిత్, అతడి తండ్రి రాం శంకర్ ఇద్దరూ అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘోరం గురించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు దాల్చంద్ర రెండో కొడుకు కుల్వీర్. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన రాం కాళిని ఎస్ఎన్ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆమె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.