విడాకులు తీసుకున్న వారు, వితంతువులే అతని టార్గెట్. మాయమాటలు చెప్పి పెళ్లాడటం.. అనంతరం శోభన కార్యక్రమాలు పూర్తయ్యాక నగదు, నగలతో ఉడాయించడం.. ఇదే అతని దినచర్య. ఇలా దేశవ్యాప్తంగా ఏకంగా 20 మంది మహిళలను పెళ్లాడాడు.. కార్యక్రమాలు పూర్తయ్యాక పరారయ్యాడు. చివరకు పాపం పండి పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ నిత్య పెళ్లి కొడుకు ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థానే జిల్లాలోని కళ్యాణ్‌కు చెందిన ఫిరోజ్ నియాజ్ షేక్ (43) అనే వ్యక్తి అనే పెళ్లి పేరుతో మహిళలను మోసగిస్తున్నట్లు తెలిపారు. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా విడాకులు పొందిన మహిళలను మాయమాటలతో నమ్మించి పెళ్లికి ఒప్పించేవాడని వెల్లడించారు. అనంతరం కార్యక్రమాలు పూర్తై నమ్మకం కుదరాక నగదు, నగలతో పరారయ్యేవాడని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు నాలుగు రాష్రాలకు చెందిన 20 మంది మహిళలు అతని మోసానికి బలయ్యారని పోలీసులు వివరించారు. అతని చేతిలో మోసపోయిన నల్లా సోపారాకు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
విచారణ చేపట్టిన ఎంబీవీవీ పోలీసులు నిందితుడు ఫిరోజ్ నియాజ్ షేక్‌ను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. అతడిని ఠానేలోని కల్యాణ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఫిర్యాదు చేసిన యువతిని మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా స్నేహం చేసి పెళ్లి చేసుకున్నాడని సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్‌సింగ్ భాగల్ తెలిపారు. నిందితుడి నుంచి రూ. 6 లక్షలకు పైగా నగదు, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్లు, చెక్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులువెల్లడించారు.