ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నర్సింహ స్థానికంగా సెంట్రింగ్ పనులు చేస్తుంటాడు. ఇల్లు కట్టి భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు. మరో 115 గజాల ప్లాటు కొనుగోలు చేశాడు.
అప్పుల పాలైన కొడుకులు గణేష్, రాజు ఆ ప్లాటు అమ్మి డబ్బులు ఇవ్వాలని తండ్రిపై ఒత్తిడి చేశారు. బరించలేక అతడు ఇంట్లోంచి వెళ్లిపోయి యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో తన తల్లి వద్ద ఉంటున్నాడు. 3 రోజుల కిందట భార్య, కొడుకులు వెళ్లి నర్సింహను ఇంటికి తీసుకొచ్చారు. అతడిని గొలుసులతో కట్టేసి బంధించారు. ప్లాటు అమ్మి డబ్బులు ఇవ్వాలంటూ చిత్ర హింసలు పెడుతూ నరకయాతన చూపించారు. తిండి పెట్టకపోవడంతో మల, మూత్ర విసర్జన కూడా గదిలో చేశాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇన్ స్పెక్టర్ సైదులు సిబ్బందితో వెళ్లగా.. భారతమ్మ తలుపులు తీయకుండా వాదనకు దిగింది. స్థానికులు వచ్చి ఆమెను నిలదీయడంతో తలుపులు తీయగా నర్సింహను గొలుసులతో కట్టి ఉంచారు. బంధించి చిత్ర హింసలకు గురి చేశారని బాధితుడు వాపోయాడు. స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.