జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం కొండ్రికర్ల గ్రామంలో జిన్నా శంకర్ అనే వ్యక్తి తల్వార్ తో హల్ చల్ చేశాడు. గ్రామ ఆలయ స్థలం విషయంలో కొద్ది రోజులుగా కొండ్రికర్ల విలేజ్ డెవలప్ మెంట్ కమిటీకి, శంకర్ కుటుంబాల మధ్య వివాదం కొనసాగుతుంది. సమస్య పరిష్కారం కోసం ఇవాళ వీడీసీ సభ్యులు సమావేశం కాగా.. విషయం తెలుసుకున్న శంకర్ తల్వార్ తో అక్కడికి వచ్చాడు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపుతానని బెదిరిస్తూ హల్ చల్ చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శంకరును అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించే క్రమంలో పోలీసు వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు.
60 సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి అనే జగ్గాసాగర్ కు చెందిన వ్యక్తి ఆలయం కోసం ఐదు ఎకరాల భూమి దానం చేసాడని వీడీసీ సభ్యులు చెబుతున్నారు. ఆ స్థలంలో గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించి, ఖాళీ స్థలాన్ని గ్రామ అవసరాలకు వినియోగించుకుంటున్నామని స్థానికులు వెల్లడించారు. ఆ స్థలాన్ని తిరిగి సుధాకర్ రెడ్డి దగ్గర కొనుగోలు చేసి శంకర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు. కొద్ది రోజులుగా ఇదే విషయంలో శంకర్ ను, అతని బంధువులకు చెందిన 8 కుటుంబాలను వీడీసీ గ్రామ బహిష్కరణ చేశారు. ఈ ఘటనపై శంకర్ ఫిర్యాదుతో ఇప్పటికే వీడీసీ సభ్యులపై కేసులు నమోదైయ్యాయి. శంకర్ పై గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా తమపైనే కేసులు పెడుతున్నారని వీడీసీ సభ్యుల ఆందోళన దిగారు. ఈ సమస్యను ఇక్కడే పరిష్కరించాలని స్థానికులు పోలీసులను డిమాండ్ చేశారు. శంకర్ పై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చి అతడిని మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.