పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్యాయత్నం

వెల్గటూర్, వెలుగు: పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడం లేదని జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి విద్యుత్​టవర్​ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన మ్యకల ప్రభాకర్​కు ఏడేండ్ల కింద కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన లావణ్యతో పెండ్లయింది. వీరికి అనీఫ్ అక్షర, హితన్స్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. అయితే కొన్నిరోజులుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారు. పలుమార్లు పెద్దమనుషులు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినా మార్పురాలేదు. తరచూ ప్రభాకర్ భార్యతో గొడవ పడుతూనే ఉన్నాడు.

గత నెలలో విషయం తెలుసుకున్న లావణ్య సోదరులు వచ్చి ప్రభాకర్​ను చితక బాది, లావణ్యను పుట్టింటికి తీసుకెళ్లారు. బామ్మర్దులు తనను కొట్టారని ప్రభాకర్ ​పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. ఎవరికి చెప్పుకున్నా తనకు న్యాయం జరగడం లేదని, అందరూ లావణ్యకే మద్దతు పలుకుతున్నారని, పుట్టింటికి వెళ్లిపోయిన భార్య తిరిగి రాలేదని కొద్దిరోజులుగా బాధపడుతున్నాడు. గురువారం తనకు చావే శరణ్యమని భావించి ఆత్మహత్య చేసుకునేందుకు గ్రామ సమీపంలోని విద్యుత్​హైటెన్షన్​టవర్​ఎక్కాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నచ్చజెప్పి ప్రభాకర్​ను కిందికి దింపారు. పోలీస్ స్టేషన్ కు తరలించి కౌన్సిలింగ్​ఇచ్చారు. లావణ్యతో కూడా మాట్లాడుతున్నామని పోలీసులు తెలిపారు.