వెంకటాపురం, వెలుగు: మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి వ్యక్తికి గాయాలైన ఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం అటవీ లో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని అంకన్న గ్రామానికి చెందిన బొగ్గుల నవీన్, సోడి నరసింహారావు, కుర్సం పెద్దబాబు కట్టెల కోసం శనివారం సాయంత్రం అడవిలోకి వెళ్లారు. తిరిగి ఆదివారం సాయంత్రం ముత్యంధార జలపాతం వద్దకు చేరారు. అక్కడ మావోయిస్టులు అమర్చిన మందు పాతరపై నవీన్ ఎడమ కాలు వేయడంతో భారీ శబ్దంతో పేలింది.
దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా.. దట్టమైన అడవి కావడంతో నవీన్ ను నరసింహారావు, పెద్దబాబు జోలె కట్టుకొని 6 కిలోమీటర్లు మోసుకొచ్చారు. 108 సిబ్బంది ఎదురెల్లి 3 కిలోమీటర్లు మోసుకొచ్చి ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించారు. నవీన్ ఆరోగ్యం నిలకడగా ఉంది.
బేస్ క్యాంపుగా మార్చే ప్రయత్నం: ఎస్పీ
తెలంగాణ– చత్తీస్ గడ్ సరిహద్దు అడవిలోని కర్రెగుట్టలను మావోయిస్టు బేస్ గ్యాంపుగా మార్చే ప్రయత్నంలోనే ఆదివాసీలను టార్గెట్ చేస్తున్నారని ములుగు ఎస్పీ శబరీశ్ పేర్కొన్నారు. తమ ఉనికి చాటుకోవడానికి మావోయిస్టులు ఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మావోయిస్టులకు ప్రజలు సహకరించవద్దని ఎస్పీ సూచించారు.