భర్త నుంచి నా కొడుకుని కాపాడండి.. పోలీసులను ఆశ్రయించిన మహిళ

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట కలహాల కారణంగా విడిపోయారు. రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. భార్య మీద కక్షగట్టిన భర్త.. తమ సంతానమైన మూడేళ్ల చిన్నారిని భార్య దగ్గరినుంచి ఎత్తుకెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ రక్షించాలంటూ పోలీసులను ఆశ్రయించింది. 

పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా గేటు కారేపల్లికి చెందిన మేఘన సూర్యాపేట జిల్లాలోని కొరబండ గ్రామానికి చెందిన ముత్యాలును ఐదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. విభేధాల కారణంగా ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. దీంతో మేఘన హైదరాబాద్ కి వచ్చి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తన కొడుకు పుట్టిన రోజును  జరుపుకునేందుకు సొంతూరిలో ఉన్న తల్లిగారింటికి వెళ్లింది. 

ఇదే అదనుగా భావించిన తన భర్త మార్చి 29న ఇంటికొచ్చి బాబును ఎత్తుకెళ్లిపోయాడని ఆమె ఆరోపిస్తోంది. తనతో పాటు తన తల్లి, చెల్లిపై దాడికి పాల్పడ్డాడని తన కుమారుడిని ఎలాగైనా కాపాడాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.