- తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే కోపంతోనే ..
- చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
- ఖమ్మం నగరంలో ఘటన
ఖమ్మం టౌన్, వెలుగు: గంజాయి మత్తులో ఓ యువకుడు తన అమ్మమ్మను హత్య చేశాడు. ఘటన తర్వాత స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ కు చెందిన అమరబోయిన రాంబాయమ్మ(80)కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు బిడ్డలు. చిన్నకొడుకు చనిపోగా, పెద్ద కొడుకు హైదరాబాద్లో స్థిరపడ్డాడు. దీంతో రాంబాయమ్మ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్, కొడుకు పంపించే కొంత డబ్బుతో జీవిస్తోంది.
రాంబాయమ్మ చిన్న బిడ్డ బుజ్జమ్మ కొడుకు ఉదయ్. బుజ్జమ్మ భర్త కొన్నేండ్ల కింద చనిపోగా ఆమె వేరొక వ్యక్తితో కలిసి ఇల్లెందులో ఉంటోంది. దీంతో ఉదయ్అమ్మమ్మ దగ్గరే ఉంటున్నాడు. మద్యం, గంజాయికి అలవాటుపడిన ఉదయ్ ఇంటర్ డిస్కంటిన్యూ చేశాడు. ఎప్పుడూ అమ్మమ్మను డబ్బుల కోసం వేధించేవాడు. సోమవారం ఉదయం తాగడానికి డబ్బులు అడగ్గా నిరాకరించింది. దీంతో కోపం పెంచుకున్న ఉదయ్ రాత్రి ఫుల్లుగా మద్యంతో పాటుగా గంజాయి సేవించి వచ్చాడు.
డబ్బులు అడిగితే ఇవ్వవా అంటూ పిడిగుద్దులు కురిపించాడు. ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో పంటితో కొరికి...గొంతు నులిమి హత్య చేశాడు. మంగళవారం ఉదయం మత్తు వీడాక తన అమ్మమ్మ చనిపోయిందని చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారు వెళ్లి చూడగా రాంబాయమ్మ తలకు గాయమై రక్తం కనిపించింది. ఉదయ్ వేసుకున్న బట్టలు రక్తసిక్తమై ఉండడంతో విషయం అర్థం చేసుకున్న వారు కర్రలతో చితకబాదారు. తర్వాత టూ టౌన్పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడు ఉదయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.