ఆర్టీసీ బస్ కింద పడి ఓ వ్యక్తి చనిపోయిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నందిగామ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో తన ద్విచక్రవాహనంపై మెహదీపట్నం నుంచి ఇంటికి బయలుదేరాడు. శివరాంపల్లి చౌరస్తా పిల్లర్ నంబర్ 307 వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి కిందపడిపోయాడు. అదే సమయంలో మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్తున్న చెంగిచెర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతని తలపై నుండి వెళ్ళింది. కాగా.. శ్రీనివాస్ హెల్మెట్ ధరించినప్పటికీ.. అది నాసిరకమైన హెల్మెట్ కావడంతో.. హెల్మెట్ పగిలి.. తల చిధ్రమై అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
వాహనదారులు ISI మార్క్ ఉన్న హెల్మెట్లనే వాడాలని రాజేంద్రనగర్ ట్రాఫిక్ సీఐ శ్యామ్ సుందర్ రెడ్డి కోరారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నాసిరకం హెల్మెట్లు వాడితే మీ ప్రాణాలకే ముప్పు ఉంటుందని ఆయన అన్నారు.