‘మా అమ్మని, గర్ల్ ఫ్రెండ్‎ని చంపేశా’.. కేరళలో ఒకేసారి ఐదుగురిని హత్య చేసిన యువకుడు

‘మా అమ్మని, గర్ల్ ఫ్రెండ్‎ని చంపేశా’.. కేరళలో ఒకేసారి ఐదుగురిని హత్య చేసిన యువకుడు

తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలో భయానక ఘటన చోటు చేసుకుంది. ఓ 23 ఏళ్ల యువకుడు కుటుంబ సభ్యులతో పాటు తన గర్ల్ ఫ్రెండ్‎ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‎కు వెళ్లి లొంగిపోయాడు. తన తల్లిని, గర్ల్ ఫ్రెండ్‎ను చంపేశానని పోలీసుల ఎదుట నేరం అంగీకరించాడు. నిందితుడు మాటలతో అప్రమత్తమైన పోలీసులు.. ఘటన స్థలానికి వెళ్లి చూడగా అక్కడ మొత్తం ఐదుగురు మృతి చెంది ఉండగా.. నిందితుడు తల్లి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వెంటనే పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పెరుమల నివాసి అఫాన్‌ (23) మొన్నటి వరకు విదేశాల్లో ఉండే ఇటీవలే ఇంటికి తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ.. ఆదివారం (ఫిబ్రవరి 23) తన కుటుంబానికి చెందిన ఐదుగురిని, అలాగే తన గర్ల్ ఫ్రెండ్‎ను హత్య చేశాడు. అనంతరం అతడు పాయిజన్ తాగాడు. అటు నుంచి నేరుగా సమీప పోలీస్ స్టేషన్‎కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు.

మొదట అఫాన్ చెప్పిన విషయం విని ఖంగుతిన్న పోలీసులు.. అ తర్వాత తేరుకుని మొదటి అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం నిందితుడి చెప్పిన వివరాల ఆధారంగా మూడు వేర్వేరు చోట్లకు వెళ్లి చూడగా అక్కడ ఐదుగురు మృతి చెంది కనిపించారు. నిందితుడి తల్లి మాత్రం కొస ప్రాణాలతో కొట్టామిట్టాడుతుండటంతో పోలీసులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 

మృతులను నిందితుడి గర్ల్ ఫ్రెండ్, అమ్మమ్మ, తమ్ముడు, బాబాయ్, పిన్నిగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు  సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ దారుణ హత్యలకు గల కారణాలు ఏంటన్న దానిపై ఆరా తీస్తున్నారు. నిందితుడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న నేపథ్యంలో అతడు కోలుకున్న తర్వాత అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. అప్పటి వరకు గానూ హత్యలకు కారణం ఏంటన్న తెలియదు.