ఓ పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం: పెళ్లాన్ని నరికి చంపి సూట్ కేసులో పెట్టాడు

ఓ పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం: పెళ్లాన్ని నరికి చంపి సూట్ కేసులో పెట్టాడు

బెంగళూరు: ఐటీ రాజధాని బెంగుళూరులో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి పారిపోయాడు. పోతు పోతూ.. మీ బిడ్డను చంపేశానని భార్య తల్లి తల్లిదండ్రులకు ఫోన్లో సమాచారం ఇచ్చి పారిపోయాడు. మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రాకేష్‌ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ హిటాచీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య గౌరీ అనిల్ సాంబేకర్ (32)తో కలిసి కర్నాటకలోని హులిమావు పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడ్డకన్నహళ్లిలో రెండు నెలలుగా నివాసం ఉంటున్నారు. గతంలో మాస్ మీడియా, కమ్యూనికేషన్ విభాగంలో పని చేసిన గౌరీ ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. గత కొంతకాలంగా రాకేష్, గౌరీల మధ్య విభేదాలు తలెత్తాయి. 

ఇద్దరి మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ క్రమంలోనే 2025, మార్చి 26న రాకేష్, గౌరీ మధ్య మరోసారి వాగ్వాదం తలెత్తింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానలా మారడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాకేష్  భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం భార్య డెడ్ బాడీని సూట్ కేసులో కుక్కి బాత్రూంలో పెట్టి పారిపోయాడు. ఈ విషయాన్ని తన భార్య గౌరీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ‘మీ బిడ్డను చంపేశా’నని చెప్పాడు.

 మృతురాలి తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించగా.. వారు హుటాహుటిన రాకేష్ నివాసానికి వెళ్లారు. రాకేష్ ఇంట్లో బాత్రూంలో సూట్ కేసులో గౌరీ మృతదేహాన్ని గుర్తించారు. గౌరీ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న రాకేష్‎ను కాల్ డేటా ఆధారంగా పుణెలో అరెస్ట్ చేశారు. 

ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సౌత్ ఈస్ట్) సారా ఫాతిమా మాట్లాడుతూ.. గురువారం (మార్చి 27) సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే హులిమావు స్టేషన్ పోలీసులు రాకేష్ ఇంటి వెళ్లారు. ఇంటికి డోర్ వేసి ఉండటంతో పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బాత్రూంలో ఒక సూట్‌కేస్‎లో మహిళ డెడ్ బాడీ కనిపించిందని తెలిపారు. 

మృతురాలి పేరేంట్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. రాకేష్‎ను పట్టుకునేందుకు ప్రయత్నించగా అతడు పరారయ్యాడు. దర్యాప్తు అధికారులు కాల్ డేటా ఆధారంగా ట్రాక్ చేసి నిందితున్ని పుణెలో అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. రాకేష్ తన భార్య డెడ్ బాడీని ముక్కులు చేయలేదని తెలిపారు. పోస్ట్ మార్టం తర్వాత గౌరీ మరణానికి గల కారణమేంటన్న దానిపై స్పష్టత వస్తోందని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుగుతోందని.. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు డీసీపీ ఫాతిమా.