నల్గొండ జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య

నల్గొండ జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరి హత్య
  • నల్గొండ జిల్లాలో అనుమానంతో భార్యను చంపిన భర్త
  • ములుగు జిల్లాలో అన్నను హత్య చేసిన తమ్ముడు

మిర్యాలగూడ, వెలుగు : అనుమానంతో ఓ వ్యక్తి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన పూజల బాల సైదయ్య, నర్సకుమారి (30) భార్యాభర్తలు. బాలసైదయ్య అడవిదేవులపల్లిలో పానీపూరి బండి నడుపుకుంటూ జీవిస్తున్నాడు. నర్సకుమారికి వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి నర్సకుమారి పడుకున్న టైంలో బాలసైదయ్య కత్తిపీటతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ నర్సకుమారి అక్కడికక్కడే చనిపోయింది. తర్వాత అతడే పోలీసులకు ఫోన్‌‌ చేసి హత్య విషయం చెప్పాడు. దీంతో పోలీసులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. 

మద్యం మత్తులో అన్నను చంపిన తమ్ముడు

వెంకటాపురం, వెలుగు : మద్యం మత్తులో ఓ వ్యక్తి గొడ్డలితో అన్నపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బుధవారం జరిగింది. వెంకటాపురం సీఐ బండారు కుమార్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని టేకులగూడెం గ్రామానికి చెందిన వాసం బుచ్చయ్య రెండో కుమారుడు బుల్లబ్బాయి అలియాస్‌‌ ఆకాశ్‌‌ మద్యానికి బానిసై ప్రతిరోజు కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అన్న విజయబాబు (30) గొడవ జరిగింది. దీంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆకాశ్‌‌ గొడ్డలితో విజయబాబుపై దాడి చేశాడు. దీంతో విజయబాబు ఎడమ కన్ను భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో విజయబాబు అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడి చిన్న తమ్ముడు వాసం రాజేంద్రప్రసాద్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.