భార్య గొంతు కోసి..కొడుకు గొంతునులిమి హత్య.. ఆపై తానూ ఆత్మహత్య

భార్య గొంతు కోసి..కొడుకు గొంతునులిమి హత్య.. ఆపై తానూ ఆత్మహత్య
  • ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు 
  • హైదరాబాద్​లోని బేగంబజార్​లో దారుణం 
  • భార్యపై అనుమానంతోనే ఘాతుకం

బషీర్ బాగ్, వెలుగు: భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. ఆమెను చంపడంతో పాటు కొడుకునూ హత్య చేశాడు. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​లోని బేగంబజార్​లో జరిగింది. ఉత్తరప్రదేశ్​కు చెందిన మహమ్మద్ సిరాజ్(38) బతుకుదెరువు కోసం కొన్నేండ్ల కింద హైదరాబాద్ కు వచ్చాడు. బేగంబజార్​లో ఉంటూ.. గాజుల దుకాణంలో పని చేస్తున్నాడు. యూపీలో ఉంటున్న భార్య, ఇద్దరు పిల్లలను ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు. అయితే యూపీలోని సొంతూరిలో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు.

ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గురువారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో కోపోద్రిక్తుడైన సిరాజ్ ఉన్మాదిగా మారి.. భార్య హేలియా(36)ను గొంతు కోసి హత్య చేశాడు. చిన్న కొడుకు హైజాన్(3)ను గొంతునులిమి చంపాడు. అప్పుడే నిద్ర లేచిన పెద్ద కొడుకు అమెజాన్.. తన తమ్ముడిని తండ్రి చంపుతుండగా చూసి భయంతో అరుస్తూ బయటకు పరుగులు పెట్టాడు. ఇరుగుపొరుగు వారికి విషయం చెప్పడంతో వారు ఇంట్లోకి వచ్చి చూసేలోగా తల్లి, కొడుకు విగతజీవులుగా పడి ఉండగా..  సిరాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో స్థానికులు డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు.

బేగంబజార్ పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా అసుపత్రికి తరలించారు. యూపీలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. సిరాజ్ రెండేండ్లకు ఒకసారి సొంతూరుకు వచ్చేవాడని, తన కుటుంబాన్ని ఇటీవలే హైదరాబాద్ తీసుకెళ్లాడని వాళ్లు చెప్పారు. ఘటనా స్థలంలో సిరాజ్ హిందీలో రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తల్లితండ్రులను క్షమించాలని కోరడంతో పాటు తమ మృతదేహాలను స్వగ్రామానికి తరలించాలని సిరాజ్ అందులో కోరినట్టు పోలీసులు తెలిపారు.