ఒక చీటింగ్.. రెండు ఆత్మహత్యలు.. ఒక హత్య

ఒక చీటింగ్.. రెండు ఆత్మహత్యలు.. ఒక హత్య
  • కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో దారుణం 
  • ఉద్యోగం ఇప్పిస్తామని దంపతుల నుంచి రూ.16 లక్షలు వసూలు చేసిన యువతి, యువకుడు 
  • జాబ్‌ ఇప్పించకపోవడంతో దంపతుల ఆత్మహత్య 
  • ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవ.. యువతి హత్య
  • చేనులో పాతిపెట్టి.. లొంగిపోయిన నిందితుడు

భద్రాద్రి కొత్తగూడెం / జూలూరుపాడు, వెలుగు: ఒక చీటింగ్‌.. ముగ్గురి మరణానికి దారితీసింది. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి దంపతులను ఇద్దరు మోసం చేశారు. దీంతో వాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరగడంతో మోసం చేసిన వారిలో ఒకరైన యువతి హత్యకు గురైంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. 

జూలూరుపాడు మండలం లోని సాయిరాం తండాకు చెందిన రత్నకుమార్‌, పార్వతి దంపతులు. వీళ్లు చుంచుపల్లిలో ఉంటూ విద్యానగర్‌ కాలనీలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పని చేస్తున్నారు.అదే మాల్‌‌‌‌లో కొత్తగూడెంకు చెందిన స్వాతి కూడా  పని చేస్తున్నది. స్వాతి గతంలో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్‌‌‌‌ స్కూల్‌‌‌‌లో పని చేసింది. ఆ టైమ్​లో జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండాకు చెందిన బానోత్​వీరభద్రంతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే షాపింగ్‌‌‌‌ మాల్‌‌‌‌లో పని చేస్తున్న రత్నకుమార్‌‌‌‌, పార్వతి, స్వాతి మధ్య పరిచయం ఏర్పడగా.. ఈ క్రమంలో స్వాతి, వీరభద్రం కలిసి సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ రత్నకుమార్‌‌‌‌, పార్వతిని నమ్మించారు. దీంతో వారు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు అమ్మడంతో పాటు మరికొంత అప్పుగా తెచ్చి మొత్తం రూ.16 లక్షలు స్వాతి, వీరభద్రంకు ఇచ్చారు. కానీ ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయామని గుర్తించిన పార్వతి, రత్నకుమార్‌‌‌‌ నెల రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నారు.

డబ్బుల విషయంలో విభేదాలు.. 

స్వాతితో వివాహేతర సంబంధం ఉన్న వీరభద్రం రెండేండ్ల కింద నందిని అనే యువతిని పెండ్లి చేసుకున్నాడు. 2 నెలల కింద స్వాతిని మాచినేనిపేటలోని తన సొంత ఇంటికి తీసుకొచ్చాడు. దీంతో వీరభద్రం, నందిని మధ్య గొడవ జరగడంతో నందిని నెల రోజుల కింద పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే పార్వతి, రత్నకుమార్‌‌‌‌ ఆత్మహత్యపై ఆ ఊరి పెద్దలు పంచాయితీ నిర్వహించి రూ.8 లక్షలు ఇచ్చేలా స్వాతి, వీరభద్రంతో ఒప్పందం కుదిర్చారు. 

డబ్బుల విషయంలో స్వాతి, వీరభద్రం మధ్య గొడవలు మొదలయ్యాయి. రత్నకుమార్‌‌‌‌ ఫ్యామిలీకి రూ.8 లక్షలు కట్టాల్సి ఉండడం, భార్య పుట్టింటికి పోవడంతో స్వాతిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9న ఇంట్లో ఎవరూ లేని టైమ్​లో సుత్తితో స్వాతిపై తలపై కొట్టి చంపాడు. డెడ్‌‌‌‌బాడీని గోనె సంచిలో కట్టి తన పొలంలో పాతి పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వాతి కనిపించడం లేదంటూ గ్రామంలోనే అందరినీ అడుగుతూ తిరిగాడు. గ్రామస్తులకు తెలిసిపోతుందన్న భయంతో జూలూరుపాడు పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు వచ్చి బుధవారం లొంగిపోయాడు. అనంతరం పొలంలో పాతిపెట్టిన స్వాతి డెడ్‌‌‌‌బాడీని బయటకు తీసి పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.