డీ ఆక్టివేట్​ చేయని సిమ్‌తో డబ్బులు స్వాహా

కోనరావుపేట, వెలుగు: బ్యాంక్ అకౌంట్ కు లింక్ ఉన్న మొబైల్ ​సిమ్‌ను డీఆక్టివేట్ ​చేయకపోవడంతో  ఓ వ్యక్తి 2.5లక్షలు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలను సీఐ కిరణ్ కుమార్  మంగళవారం కోనరావుపేట పోలీస్​స్టేషన్​లో వెల్లడించారు. కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన కొమ్ము ప్రశాంత్ కొన్ని నెలల కింద గల్ఫ్​వెళ్లాడు. అతను ఇండియాలో వాడుకున్న సిమ్.. యూబీఐ అకౌంట్​కు లింకై ఉంది. ఆ తర్వాత ఆ సిమ్ వాడకపోవడంతో సర్వీస్ ప్రొవైడర్​ ఏపీలోని పార్వతీపురం జిల్లాకు చెందిన కర్రీ నవీన్ కు కేటాయించింది. దీంతో అకౌంట్‌లో డబ్బులు క్రెడిట్​అయ్యాయని నవీన్ మొబైల్‌కు మెసేజ్​వచ్చింది. 

అతను ​పేటీఎం యాప్‌లో రిజిస్టరై ఏప్రిల్‌లో దఫాలుగా  రూ.2,47,970 డ్రా చేసుకున్నాడు. ఇటీవల డబ్బులు అవసరం ఉండగా ప్రశాంత్ తండ్రి పోశయ్య.. కొడుకు ఏటీఎం కార్డుతో డబ్బులు తీసేందుకు ప్రయత్నించగా అకౌంట్‌లో బ్యాలెన్స్ లేదు. బ్యాంకులో సంప్రదించగా డబ్బు డ్రా చేసినట్లు చెప్పడంతో ఆయన కోనరావుపేట స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన ఎస్సై రమాకాంత్ టెక్నాలజీ సాయంతో నిందితుడిని గుర్తించారు. మంగళవారం అతను పార్వతీపురం నుంచి హైదరాబాద్​ వెళ్తుతుండగా వరంగల్‌లో పోలీసులు పట్టుకున్నారు. అరెస్ట్​చేసి రిమాండ్‌కు తరలించారు.