- సైబర్ నేరగాళ్ల వలలో కొత్తూరు వాసి
- టెలిగ్రామ్‌లో లింక్ పంపించి రూ.88 వేలు కాజేసిన కేటుగాళ్లు
లక్సెట్టిపేట, వెలుగు: డబ్బులు డిపాజిట్ చేస్తే ఎక్కువ మొత్తంలో తిరిగి వస్తాయంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తికి రూ. 88 వేలు కుచ్చుటోపీ పెట్టారు. లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. లక్సెట్టిపేట మండలంలోని కొత్తూరుకు చెందిన ఓ వ్యక్తికి గతంలో టెలిగ్రామ్ యాప్‌లో ఓ లింక్ వచ్చింది. దానిని ఓపెన్ చేస్తే రూ. 900 వస్తాయని ఉండడంతో వెంటనే ఓపెన్ చేశాడు. చెప్పినట్లుగానే అతడికి రూ. 900 వచ్చాయి. మళ్లీ కొన్ని రోజుల తర్వాత రూ.10 వేలు డిపాజిట్ చేస్తే రూ.19 వేలు వస్తాయని లింక్ రావడంతో దానిని ఓపెన్ చేసి డబ్బులు డిపాజిట్ చేశాడు. దీంతో తిరిగి రూ. 19 వేలు అతడి అకౌంట్‌లో పడ్డాయి. దీంతో ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో ఓ సారి రూ. 20 వేలు, మరో సారి రూ.68,800 డిపాజిట్ చేశాడు. కానీ తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేశాడు.