తండ్రి కోరిక మేరకు ఓ యువకుడు దిష్టిబొమ్మను పెళ్లి చేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో బుధవారం జరిగింది. గురుపూర్ కు చెందిన శివమోహన్ అనే 90 వృద్ధునికి 9 మంది కుమారులు. వారిలో 8 మందికి పెళ్లిళ్లు అయిపోయాయి. చివరివాడు మాత్రం పెళ్లికాకుండా ఉన్నాడు. అయితే శివమోహన్ చనిపోయేలోపు తన పిల్లలందరికీ పెళ్లిళ్లు చేయాలనుకున్నాడు. శివమోహన్ చిన్న కొడుకుకు ఆస్తులు ఏవీలేవు. అంతేకాకుండా అతను కాస్త మందబుద్ధి గలవాడు. దాంతో శివమోహన్ తన చిన్న కొడుకుకు ఎలాగైనా పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ.. అతనికి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకురాలేదు. దాంతో తన చివరి కోరిక తీర్చుకోవడానికి.. చిన్న కొడుకుకు ఒక దిష్టిబొమ్మతో పెళ్లి చేశాడు.
అయితే దిష్టిబొమ్మే కదా అని తీసిపారేయకండి.. ఆ బొమ్మను కూడా పట్టు చీర మరియు పువ్వులతో అలంకరించారు. వరుడు.. ఆ దిష్టిబొమ్మను ఎత్తుకొని అగ్ని చుట్టూ ఏడు అడుగులు కూడా వేశాడు. ఈ తతంగం అంతా పూజారి దగ్గరుండి మరీ జరిపించాడు.
శివమోహన్ చనిపోయేలోగా తన కొడుకులందరికి వివాహం చేయాలని పట్టుబట్టాడని ఆయన బంధువులు తెలిపారు. దిష్టిబొమ్మతో పెళ్లి కదా అని.. ఏదో అల్లాటప్పగా చేయలేదు. శివమోహన్ ఈ పెళ్లికి కొంతమంది దగ్గరి బంధువులని పిలిచి.. వివాహం తర్వాత విందు కూడా ఇచ్చాడు. మనదేశంలో ఇలాంటి పెళ్లిళ్లు అంత కొత్తేమీ కాదు. ఎందుకుంటే మనదేశంలో చెట్టుతో కూడా పెళ్లి చేసే ఆచారం చాలాకాలం నుంచి ఉంది.
For More News..