భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సినిమాను తలపించిన ఘటన

చర్ల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని ఎర్రబోరులో సినిమాలోనే కనిపించే సన్నివేశం నిజంగా జరిగింది. గ్రామానికి చెందిన మడివి సత్తిబాబు డిగ్రీ వరకు చదివాడు. లక్ష్మీకాలనీ పంచాయతీ దోశిల్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ఇంటర్​చదువుతున్న రోజుల్లో ప్రేమించాడు. ఇదే క్రమంలో వరసకు మరదలైన కుర్నపల్లి గ్రామానికి చెందిన సునీతను కూడా ఇష్టపడ్డాడు. మూడేండ్లుగా ఒకరికి తెలియకుండా ఒకరితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వప్నకు పాప, సునీతకు బాబు పుట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులు వచ్చి పెండ్లి చేసుకోవాలని కోరగా..ఇద్దరినీ  ప్రేమించానని..ఒకరిని పెండ్లి చేసుకొని మరొకరికి అన్యాయం చేయనని చెప్పాడు. పెండ్లాడితే ఇద్దరినీ పెండ్లాడతానని చెప్పి ఒప్పించాడు. మూడు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీ జరగ్గా వారు ముగ్గురి ఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ ఒప్పుకోవడంతో గురువారం ఉదయం వేదమంత్రాలు, బంధుమిత్రుల నడుమ వీరు ఒక్కటయ్యారు. ఎప్పుడూ చూడని సన్నివేశం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో జనాలు తరలివచ్చి పెండ్లిని తిలకించారు.